భోగి మంటల్లో పీపీపీ జీఓ ప్రతులు
పరిగి: ‘అధికారం చేపట్టిన ఇరవై నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో నింగికి నిచ్చెన వేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ అన్నారు. మండలంలోని ఎర్రగుంట పంచాయతీ పరిధి నేతులపల్లిలో బుధవారం ఆమె పార్టీ శ్రేణులు, స్థానిక మహిళలతో కలిసి పర్యటించారు.
మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జీఓల దగ్ధం
ప్రతి ఇంటా పాత వస్తువులు, పనికి రాని చెత్త చెదారాన్ని కాల్చి మంచి రోజులు ప్రసాదించాలని జరుపుకునే పండగ భోగి అని ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ సీఎం చంద్రబాబు తెచ్చిన జీఓలను భోగి మంటల్లో కాలుస్తున్నామన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేట్ స్థాయిలో రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కక్షకట్టి రద్దు చేయడంతో పాటు 10 కాలేజ్‌లను ప్రైవేటీకరణ చేయడానికి జీఓలను విడుదల చేశారని విమర్శించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజ్ ఉండాలని, అప్పుడే కార్పొరేట్‌స్థాయిలో వైద్య సేవలు నిరుపేదలకు అందుతాయన్న బృహత్తర కార్యక్రమాన్ని జగనన్న చేపట్టారన్నారు. ప్రజల్లో మంచి పేరు వస్తుందన్న దుర్భుద్దితో నేడు చంద్రబాబు ప్రైవేటీకరణతో ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, రైతాంగాన్ని రక్షించలేని దుర్మార్గ పాలన అందిస్తున్న చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల ఉసురు తగులుతుందన్నారు.
సవిత.. హాఫ్ నాలెడ్జ్ మంత్రి
ఓట్లేసి గెలిపించిన ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పని చేసిన ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో ఎక్కడా మన్ననలు పొందలేదని ఉషశ్రీచరణ్ స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. ఇటీవలే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందించి, దుష్పరిణామాలను జగనన్న వివరించారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉంటున్న సవితకు మెడికల్ కాలేజీలపై అవగాహన లేకపోగా కడుపు మంటతో మాట్లాడుతున్నారని, హాఫ్ నాలెడ్జ్ మంత్రిగా సవిత ఇప్పటికే ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, మండల, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కదిరిలో..
కదిరి టౌన్: చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ఇచ్చిన జీఓలను బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకులు దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని కోరుతూ కదిరి నియోజకవర్గంలోని ప్రజలకు కార్యకర్తలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శి లింగాల కృపాకర్‌రెడ్డి, పంచాయతీ వింగ్ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎం.రామ్‌ప్రసాద్, షానుబాయ్, పట్టణ ఎస్సీ వింగ్ అధ్యక్షుడు చిన్నరెడ్డప్ప, టౌన్ బూత్ కమిటీ కన్వీనర్ ఎహెసాన్, ఉప సర్పంచ్ ఫక్రోద్దీన్, ఎస్సీ నాయకులు భాస్కర్, దివ్యాంగుల విభాగం పట్టణ అధ్యక్షులు నాగేంద్ర, నాయకులు అంజి తదితరులు
పాల్గొన్నారు.
భోగి మంటల్లో పీపీపీ జీఓ ప్రతులు


