హాకీ టోర్నీ విజేత ‘కాకినాడ’
ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీ విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా జట్టుతో తలపడిన కాకినాడ జట్టు ఆది నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2–0 గోల్స్ తేడాతో విజేత ట్రోఫీని కై వసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ జిల్లా జట్టుకు ధర్మవరం షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షుడు వీరనారాయణ, మూడో స్థానంలో నిలిచిన అన్నమయ్య జిల్లా జట్టుకు చేనేత నాయకురాలు జయశ్రీ బహుమతులు, ట్రోఫీలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మవరంలో జాతీయ స్థాయి హాకీ టోర్నీ నిర్వహణకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ట్రెజరర్ థామస్ పీటర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, ఉపాధ్యక్షుడు గౌరీప్రసాద్, ఉడుముల రామచంద్ర, ఊకా రాఘవేంద్ర, మహమ్మద్ అస్లాం, ట్రెజరర్ అంజన్న, హాకీ కోచ్ హసేన్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంలో జాతీయ స్థాయి
హాకీ టోర్నీ నిర్వహణకు కృషి : మంత్రి


