జగ్జీవన్‌రామ్ సేవలు వెలకట్టలేనివి
పుట్టపర్తి టౌన్: కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దాదాపు మూడు శతాబ్దాల పాటు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శనివారం స్థానిక సాయిఆరామంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ 118 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న ముఖ్యఅతిథులుగా హాజరై అధికారులతో కలసి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... విద్యతోనే సమాజంలో అసమానతలు రూపుమాపడం సాధ్యమని నమ్మిన జగ్జీవన్‌రామ్...నిరుపేదల జీవితాల్లో విద్యావెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వ్యవసాయ మంత్రిగా కరువు నివారణ చర్యలు చేపట్టి హరిత విప్లవాన్ని ప్రోత్సహించారన్నారు. నవ సమాజ స్థాపనకు జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని, యువత ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, నాయకులు సామకోటి ఆదినారాయణ, పెడపల్లి నరసింహులు, యశోద, పంచరత్నమ్మ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్‌తోపాటు కుల సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జయంతి వేడుకల్లో కలెక్టర్ చేతన్


