తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్
తాడిపత్రి టౌన్: దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చేలోపు మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించారు. వివరాలు... తాడిపత్రిలోని జయనగర్ కాలనీకి చెందిన లక్ష్మీగోవిందమ్మ ఆదివారం సుంకులమ్మపాలెం వద్ద వున్న సుంకులమ్మ ఆలయానికి వెళ్లింది. ఉగాది పర్వదినం కావడంతో అప్పటికే ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీలోనే దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం తమన మెడలోని 4 తులాల బరువున్న బంగారం గొలుసు కనిపించలేదు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర హాకీ జట్టులో
ధర్మవరం వాసులు
ధర్మవరం: హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్నీలో జరిగే 15వ పురుషుల జాతీయ సీనియర్ హాకీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన ప్రశాంత్, లోకేష్‌కు చోటు దక్కింది. ప్రతిభ చాటి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్న స్థానిక క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బంధనాథం సూర్యప్రకాష్, జిల్లా గౌరవాద్యక్షుడు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, బీవీ శ్రీనివాసులు, ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, ఊకా రాఘవేంద్ర, మహమ్మద్ అస్లాం, అంజన్న తదితరులు అభినందించారు.
బావిలో పడిన జింక పిల్ల
అగళి: నీటి కోసం వెదుకులాడుతూ వచ్చిన ఓ జింక పిల్ల చివరకు నీరు లేని బావిలో పడింది. అగళి మండలం కసాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన లైన్‌మెన్ నరసింహమూర్తి గమనించి సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 20 అడుగుల లోతున ఉన్న భావిలోకి స్థానిక యువకులు నాగరాజు, కుమార్ దిగి జింక పిల్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి అటవీశాఖ అధికారులు సంజీవరాయుడు, భీమన్న, నాగరాజుకు అప్పగించారు. నీళ్లు తాపిన అనంతరం కోలుకున్న జింకపిల్లను సురక్షితంగా వదిలేశారు.
తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్


