సూక్ష్మ సేద్యం పరికరాల దగ్ధం
చెన్నేకొత్తపల్లి: మండలంలోని పులేటిపల్లి గ్రామ సమీపంలో పొలాల్లో ఉంచిన డ్రిప్, స్ప్రింక్లర్ల పైపులు ఆదివారం అగ్నికి ఆహుతైనట్లు రైతు వాపోయాడు. వివరాలు... గ్రామానికి చెందిన రైతు దాసరి పెద్దన్న తన పొలంలో ఉన్న వేప చెట్టు కింద 30 స్ప్రింక్లర్ల పైపులు, 15 కట్టల డ్రిప్ పైపును భద్ర పరిచాడు. ఆదివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా మంటలు వ్యాపించి సూక్ష్మ సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనతో రూ.50 వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.
‘రెవెన్యూ’ బెదిరింపులు.. రైతు ఆత్మహత్యాయత్నం
బత్తలపల్లి: రెవెన్యూ అధికారుల బెదిరింపులతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణస్వామికి గ్రామంలో తనకున్న 2.43 ఎకరాల పొలంలో వ్యవసాయంతో పాటు గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గొర్రెల పోషణకు తన పొలంలో కంచె వేయాలని నిర్ణయించుకుని ఇప్పటికి ఐదు దఫాలుగా రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాడు. అధికారలు నిర్దేశించిన హద్దుల మేరకు తన భాగానికి వచ్చిన పొలంలో కంచె వేసేందుకు సిద్ధం కాగా, పక్క పొలం రైతు అభ్యంతరాలు లేవనెత్తాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని గ్రామ సర్వేయర్ రవికిరణ్, వీఆర్‌ఓ నాగేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో వారు నారాయణస్వామికి ఫోన్ చేసి కంచె ఎలా వేస్తావంటూ బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణస్వామి శనివారం తన పొలంలోనే క్రిమి సంహారక మందు తాగాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉప్పర్లపల్లికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలసి ఆరా తీశారు. ఘటనపై ఫిర్యాదు స్వీకరించారు. బెంగళూరులోని ఆస్పత్రికి పోలీసులు వెళ్లి బాధితుడి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు. కాగా, తాము బెదిరించలేదని, సమస్యను పరిష్కరించేందుకు సర్దిచెప్పినట్లు పోలీసుకు వీఆర్వో నాగేంద్ర, సర్వేయర్ రవికిరణ్ తెలిపినట్లు సమాచారం.


