అమరాపురం: మండలంలోని కె.శివరం గ్రామ శివారులో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన పాడి రైతు మహంతేష్ గ్రామ సమీపంలోని పొలంలో గేదెకు గ్రాసం కోస్తుండగా పొదల మాటు నుంచి ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఆ సమయంలో ప్రతిఘటించడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. మహంతేష్ కేకలు విన్న సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వారు అక్కడకు చేరుకుని గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి బెదిరి అక్కడి నుంచి పారిపోయింది. క్షతగాత్రుడిని హేమావతిలోని పీహెచ్‌సీకి తరలించారు. గ్రామ శివారలోకి ఎలుగుబంటి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు, అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు.
చిరుతల దాడిలో జీవాల మృతి
పావగడ: తాలూకాలోని కన్నమేడి గ్రామంలో చిరుతల దాడిలో నాలుగు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత రైతు హనుమంతరాజు తెలిపిన మేరకు.. గ్రామం బయలు ప్రదేశంలో చెరువు వద్దకు గురువారం సాయంత్రం తన మేకలు, గొర్రెలను మేపునకు హనుమంతరాజు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పొదల మాటు నుంచి వచ్చిన రెండు చిరుతలు మందపై దాడి చేశాయి. ఘటనలో రెండు గొర్రెలు, రెండు మేకలు మృతి చెందాయి. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన హనుమంతరాజు భయభ్రాంతులకు గురయ్యాడు. జీవాల పెంపకంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరాడు.
బ్యాంకుల బంద్ వాయిదా
అనంతపురం అగ్రికల్చర్: ఈ నెల 24, 25న తలపెట్టిన బ్యాంకుల బంద్ వాయిదా పడింది. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. జాతీయ కమిటీ, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన వ్యక్తమైన నేపథ్యంలో సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జాతీయ కమిటీ నుంచి సమాచారం అందిందన్నారు.
ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు