లేపాక్షి: బోర్లలో నీరు పుష్కలంగా ఉంది..పైప్‌లైన్ సమస్య లేదు. మోటార్లు బాగానే పనిచేస్తున్నాయి. కానీ నిర్వహణ లోపంతో కల్లూరు ఎస్సీ కాలనీ వాసులు ఐదు నెలలుగా తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో బస్టాండు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తమ కాలనీలో వ్యక్తిగత కొళాయిలు లేవని, దీంతో పబ్లిక్ ట్యాప్‌ల వద్దే నీరు పట్టుకుంటామన్నారు. నీరు తగినంత అందుబాటులో ఉన్నా సరఫరా చేయడంలో నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. దీంతో కుటుంబానికి రెండు, మూడు బిందెల నీరు అందడం లేదన్నారు. దీంతో నీటికోసం తాము ఐదు నెలలుగా పనులు మానుకుని పడరానిపాట్లు పడుతున్నామన్నారు. నీటి సమస్యతో హోలీ పండుగ కూడా చేసుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కల్లూరు ఎస్సీ కాలనీలో
ఐదు నెలలుగా తాగునీటి సమస్య
పట్టించుకోని అధికారులు...
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు