పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు

Mar 22 2025 1:36 AM | Updated on Mar 22 2025 1:31 AM

పుట్టపర్తి టౌన్‌: పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. నల్లమాడ మండలం ఎనుమలవారిపల్లికి చెందిన కుళ్లాయప్ప కుమారుడు వీరానిపల్లి చిరంజీవి (22) ఓ బాలికను ఇంటి వద్ద వదిలిపెడతానని తన ఆటోలో తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కదిరి పోలీస్‌ స్టేషన్‌లో 2019 మార్చి 22న కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే రోజు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి సీఐ బి.వెంకట చలపతి కేసు దర్యాప్తు చేశారు. అనంతరం సీఐ టి.మధు జిల్లా సెషన్స్‌ కోర్టులో నిందితుడు వీరానిపల్లి చిరంజీవి అలియాస్‌ చిరుపై చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసును అనంతపురం ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. గురువారం ఈ కేసును ట్రయిల్‌ చేసి మొత్తం 14 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి వీరానపల్లి చిరంజీవి అలియాస్‌ చిరుకు 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రత్యేక న్యాయ స్థానం (పోక్సో కోర్టు) శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. స్పెషల్‌ పీపీ ఈశ్వరమ్మ, విద్యాపతి వాదించారు.

మెడికల్‌ షాపుల్లో

అధికారుల తనిఖీలు

హిందూపురం టౌన్‌: ‘ఆపరేషన్‌ గరుడ’లో భాగంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమన్న, విజిలెన్స్‌ అధికారులు, ‘ఈగల్‌’ అధికారులు సంయుక్తంగా శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఏడు మెడికల్‌ షాపులపై దాడులు చేశారు. హిందూపురంలోని నాగశ్రీ, జనతా, బృంద మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనల అతిక్రమణలపై కేసులను నమోదు చేశారు. ఒక మెడికల్‌ షాపులో కాలం చెల్లిన ఔషధాలను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మత్తు కలిగించే (ఎన్‌ఆర్‌ఎక్స్‌) మందుల కొనుగోలు, అమ్మకాలలో వ్యత్యాసాలు గుర్తించినట్లు అనంతపురం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వైబీపీటీఏ ప్రసాద్‌ తెలిపారు. దాడుల్లో విజిలెన్స్‌ సీఐలు జమాల్‌బాషా, సద్గురుడు తదితరులు పాల్గొన్నారు.

ఇంగ్లిష్‌ పరీక్షకు

111 మంది గైర్హాజరు

పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన ఇంగ్లిష్‌ పరీక్షకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 21,396 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 21,285 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు.

13 మంది విద్యార్థుల డీబార్‌

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఎల్‌ఎల్‌బీ మొదటి, ఆరో సెమిస్టర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన 13 మంది విద్యార్థులను డీబార్‌ చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు. ఇంజినీరింగ్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement