కదిరి: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడు ఆశీనులైన బ్రహ్మరథం సరిగ్గా ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.53 గంటలకు తేరు యథాస్థానం చేరుకుంది.
● రథం వెళ్లాక రోడ్డుపై పడిన మిరియాలను భక్తులు ఒక్కోటి సేకరించడం కన్పించింది. అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని వారి నమ్మకం.
● యువత చొక్కాలు చింపడం, రంగులు చల్లుకోవడం కనిపించింది.
● మిద్దెలపై నుంచి కొందరు రథంలాగే భక్తుల మీదకు బిందెలతో నీళ్లు చల్లారు. మరికొందరు నీళ్ల ప్యాకెట్లు విసిరారు.
● భక్తుల కోసం అడుగడుగునా ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లను పెద్ద ఎత్తున పంచిపెట్టారు.
● బ్రహ్మోత్సవాల కోసం ఆర్టీసీ ప్రతినిధులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
● బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తిరువీధుల్లోని మిద్దెలపైకి ఎక్కారు.
● కదిరి బ్రహ్మ రథోత్సవంలో 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా.
● రథోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ వి.రత్న దగ్గరుండి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవానికి సహకరించిన పోలీసు అఽధికారులు, సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
నేడు అలుకోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు అశ్వవాహనంపై తిరువీధుల్లో దర్శనమివ్వనున్నారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆలయం పక్కనే ఉన్న సుద్దుల మంటపం వద్దకు తీసుకువచ్చి అలుకోత్సవాన్ని నిర్వహించనున్నారు.