ధర్మవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చేనేత రంగానికి అరకొర కేటాయింపులు జరిపి చేనేతలకు తీరని అన్యాయం చేసిందని, ప్రభుత్వ చర్యల కారణంగా చేనేత మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడగ వెంకటనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ నుంచి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడారు. ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి చేనేతలను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తారని భావించామన్నారు. ఇదే అంశాన్ని ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సైతం ధర్మవరంలో నేతన్నలకు స్పష్టమైన భరోసానిచ్చారన్నారు. చేనేతలకు జీఎస్టీని ఎత్తివేస్తామని, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, ఆప్కో ద్వారా సొసైటీలకు నిధులు ఇస్తామని హామీలు గుప్పించారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకాన్ని ఆపేశారన్నారు. అంతేకాక రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి కేవలం రూ.138కోట్లు నిధులు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేశారన్నారు. ఈ నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతాయని, ఇక చేనేతలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేసి బడ్జెట్‌లో నిధులు సరిపడా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు, వెంకటస్వామి, ఆదినారాయణ, శ్రీనివాసులు, శ్రీధర్, రంగయ్య, కొండ, పెద్దకోట్ల గణేష్, కేశవ, రమణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఏపీ చేనేత కార్మిక సంఘం వినూత్న నిరసన