పుట్టపర్తి: విద్యార్థుల జీవితంలో తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాసే రోజు రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 104 పరీక్ష కేంద్రాల్లో 23,730 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలుంటాయి. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో మౌలి వసతులు కల్పించారు. విద్యార్థులకు ఏచిన్న ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, ఫర్నీచరు, విద్యుత్ సదుపాయం అన్ని కేంద్రాల్లోనూ ఉండేలా అధికారులు దృష్టి సారించారు.
గంట ముందుగానే చేరుకోవాలి..
తొలిరోజు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా వచ్చి హాల్‌టికెట్ నంబరు ఆధారంగా ఏ గది ఎక్కడుందో చూసుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. హాల్‌టికెట్ చూపిస్తే చాలు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకొచ్చే సమయం, వాటిని ఓపెన్ చూసి విద్యార్థులకు అందజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మీడియంను ఒకటికి రెండుసార్లు పరిశీలించి సంబంధిత ప్రశ్నపత్రం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఏమాత్రం తారుమారైనా విద్యార్థులు నష్టపోతారనే విషయాన్ని ఇన్విజిలేటర్లు గుర్తు పెట్టువాలని చెబుతున్నారు. పేపర్ లీక్ చేస్తే అడ్డంగా బుక్ అవుతారని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల్లోకి సిబ్బంది కోసం టీ, కాఫీ బయట నుంచి తీసుకురాకూడదు. పొరబాటున ఏ ఒక్క వ్యక్తి బయటకు వచ్చినా అందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, అడిషనల్ డిపార్ట్‌మెంటల్ అధికారి, ఎంఈఓలను బాధ్యులను చేస్తారు.
పటిష్ట బందోబస్తు
పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరన్నారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, సెల్‌ఫోన్ షాపులు తెరిచి ఉంచరాదని ఎస్పీ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద గుంపులుగా ఉండరాదని, 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
పరీక్షలు రాయనున్న 23,730 మంది విద్యార్థులు
సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు