దేవాలయాలకు భద్రత కరువు | - | Sakshi
Sakshi News home page

దేవాలయాలకు భద్రత కరువు

Aug 31 2026 12:02 AM | Updated on Aug 31 2026 12:02 AM

● వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగులోని నాగరమ్మ దేవస్థానంలో అమ్మవారి సరుడు, మంగళసూత్రం, వెండి వస్తువులు, నగదు అపహరించారు. ● వెంకటాచలం మండలం పాలిచెర్లపాడులోని ఆదిలక్ష్మమ్మ ఆలయంలో దుండగులు హుండీ పగులగొట్టి నగదు చోరీ చేశారు. ● కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెంలోని పోలేరమ్మ ఆలయం, కుడుములదిన్నెపాడులోని ఆంజనేయస్వామి ఆలయాల్లో దుండగులు బంగారు వస్తువులు, నగదు దోచుకెళ్లారు. ● ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి కొండాపురం మండలం సాయిపేట గ్రామంలోని వీర్ల అంకమ్మతల్లి, అంకమ్మతల్లి, బీసీ కాలనీలోని అంకమ్మతల్లి, గ్రామ శివారులోని గంగమ్మతల్లి ఆలయాల్లో దుండగులు హుండీలు పగులగొట్టి నగదు అపహరించారు. ● ఈనెల 15వ తేదీ రాత్రి కలువాయి మండలం పల్లకొండ గ్రామంలోని రెండు దేవాలయాల్లో చోరీలు జరిగాయి. ● 25వ తేదీ తెల్లవారుజామున అనుమసముద్రంపేట మండలంలోని పందిపాడు కోదండరామస్వామి ఆలయంలో గేటు తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, హుండీలోని నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ● తాజాగా కలిగిరి మండలంలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది.

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో ఆలయాలకు భద్రత కొరవడటంతో దొంగలు విజృంభిస్తున్నారు. గ్రామాలకు దూరంగా, ప్రధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నవాటిని లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు. గేట్లు, తలుపులు పగులగొట్టి విగ్రహాలపై ఉన్న బంగారు ఆభరణాలు, హుండీల్లోని కానుకలను ఎత్తుకెళ్తున్నారు. కొన్నిచోట్ల హుండీలను ఆలయాలకు దూరంగా పడేసి నగదును అపహరిస్తున్నారు. చోరీల నివారణలో పోలీసు యంత్రాంగం, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంలో ఆలయ కమిటీలు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాలు, దర్గాలు, మసీదులు, చర్చిల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్‌ శాఖ గతంలోనే సూచించినా.. అనేకచోట్ల ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు, దాడులు జరిగినప్పుడు వాటికి సంబంధించిన దృశ్యాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఆలయ కమిటీలు అప్రమత్తమై సూచనలు పాటించి భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.

వరుస ఘటనలు

తప్పనిసరిగా భద్రతా చర్యలు

వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలతో ఆలయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎలాంటి నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడం, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం దొంగలకు అనుకూలంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏం చేయాలంటే..

ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. రాత్రివేళల్లో సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలి. ఆలయం మూసే ముందు తలుపులు, గేట్లకు తాళాలు సక్రమంగా వేశారో లేదో తనిఖీ చేసుకోవాలి. హుండీల్లోని కానుకలను తరచూ ఖాళీ చేయడంతోపాటు.. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి. ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్‌ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

కలిగిరి మండలంలో చోరీ జరిగిన కోదండరామస్వామి ఆలయం

బంగారు ఆభరణాలు, నగదు తస్కరణ

నిర్మానుష్య ప్రాంతాల్లోని

ఆలయాలే టార్గెట్‌

కనీస జాగ్రత్తలు తీసుకోని

కొందరు నిర్వాహకులు

వరుస ఘటనలతో భక్తుల్లో ఆందోళన

రెండు ఆలయాల్లో..

కలిగిరి: మండలంలోని చిన్నఅన్నలూరులోని కోదండరామస్వామి, అంకమ్మతల్లి ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. కోదండరామస్వామి ఆలయంలో అమ్మవారి మెడలోని మంగళసూత్రం దొంగతనం చేశారు. అంకమ్మ ఆలయంలో అమ్మవారి ముక్కుపుడక, హుండీని ఎత్తుకెళ్లారు. ఆదివారం గ్రామస్తుల సమాచారం మేరకు కలిగిరి పోలీసులు పరిశీలించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీమ్‌ వేలిముద్రలను సేకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement