● ఆగని చికెన్ వ్యర్థాల తరలింపు
● పొదలకూరు మీదుగా సంగం, బుచ్చి, నెల్లూరుకు..
● చేపలు, రొయ్యల మేతకు వినియోగం
● కేసులు పెడుతున్నా మారని తీరు
పొదలకూరు: పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా చికెన్ వ్యర్థాల రవాణా మాత్రం ఆగడం లేదు. పగటి వేళల్లో వ్యర్థాలను తరలించకుండా రాత్రి, తెల్లవారుజామున మినీ లారీలు, వ్యాన్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. గతంలో పగటి వేళ పొదలకూరు పట్టణం మీదుగా వ్యర్థాలు తరలించడంతో దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుస ఫిర్యా దులు రావడంతో ప్రస్తుతం రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు. తిరుపతి, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో పొదలకూరు మీదుగానే అధికంగా రవాణా చేస్తున్నట్టు సమాచారం.
మేతగా వినియోగం
సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, పొదలకూరు మండలం కొనగలూరులో చేపల గుంతలున్నాయి. ఆయా ప్రాంతాల్లో చేపలు, రొయ్యలకు మేతగా చికెన్ వ్యర్థాలను వినియోగిస్తున్నారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే వ్యర్థాలు పొదలకూరు పట్టణం మీదుగానే తరలివెళ్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు నాలుగైదు పర్యాయాలు వ్యర్థాలను తరలిస్తున్న మినీ లారీలు, ఆటోలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. గత వారంలో కూడా డ్రమ్ముల్లో తీసుకెళ్తున్న మినీ లారీని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారులు వ్యర్థాలను తవ్వి పాతిపెట్టారు. అలాగే మండలంలోని బిరదవోలు గ్రామ సమీపంలో రాత్రివేళ వ్యర్థాలను తరలిస్తున్న లారీలను గ్రామస్తుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చేపలు, రొయ్యలకు చికెన్ వ్యర్థాలను మేతగా ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. మండలంలోని కొనగలూరు చేపల గుంతల నిర్వాహకులు సైతం వాటిని వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.
హైవే మీదుగా..
చైన్నె, తిరుపతి, బెంగళూరు నుంచి మనుబోలు వరకు హైవే మీదుగా వచ్చిన తర్వాత వీరంపల్లి మీదుగా పొదలకూరుకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి సంగం, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసుల వరకు నమోదయ్యాయి. డ్రైవర్లు, వాహన యజమానులపై కేసులు పెట్టారు. అయినా వ్యర్థాల రవాణా కొనసాగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. సంగం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు పొదలకూరు మార్గం అనువుగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.


