● మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం
నెల్లూరు(టౌన్): ‘కూటమి ప్రభుత్వం నూతన పోకడలతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తోంది. ఇదే రీతిలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ టెట్ పేరుతో టీచర్ల ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. టెట్‌పై వచ్చేనెల 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించడంతోపాటు పీఆర్సీని నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. బకాయిలు పడిన ఐదు డీఏలను మంజూరు చేయాలన్నారు. కార్పొషన్ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. అనంతరం బద్దలైన నిశబ్దం పుస్కకాన్ని బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శేషు, చలపతిశర్మ, నాయకులు అచ్చయ్య, ఖాజావలీ, మురళీధర్, శ్రీదేవి, రమాదేవి, మధుసూదన్, నాగిరెడ్డి, బాలరాగయ్య, భారతి, శైలజ, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


