● నలుగురికి గాయాలు
మర్రిపాడు: నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై అల్లంపాడు క్రాస్‌రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి కోవెలకుంట్లకు ఆదివారం ఏడుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. అల్లంపాడు క్రాస్‌రోడ్డు సమీపంలో కారు అదుపుప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడిన నలుగురిని 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ఆత్మకూరు ఎంవీఐ రాములు పరిశీలించారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
నేడు ‘డయల్
యువర్ ఎస్‌ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని ఎస్‌ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్‌కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సీతారామపురం: అతను కుమార్తెను బడిలో వదిలాడు. పనికి అవసరమైన సామగ్రి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే విధి చిన్నచూపు చూడటంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మండలంలోని సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మార్కాపురం జిల్లా సీఎస్ పురం మండలం నల్లమడగల ఎస్సీ కాలనీకి చెందిన గుడిగుంట్ల నారాయణ (45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నారాయణ ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన కుమార్తెను మోటార్‌బైక్‌పై వైఎస్సార్ కడప జిల్లాకు తీసుకెళ్లి ఓ పాఠశాలలో వదిలిపెట్టాడు. తిరుగు ప్రయాణంలో అత్తగారి గ్రామమైన సాయిశెట్టిపల్లెకు వెళ్లి అక్కడున్న బేల్దారి సామగ్రిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. దారిలో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయమై మృతిచెందాడు. అటుగా వెళ్లే ప్రయాణికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.


