పనుల కల్పనా గగనమే
●
నెల్లూరు(పొగతోట): కూటమి పాలనలో వీబీ జీరామ్‌జీ శ్రామికులకు కష్టాలు తప్పడంలేదు. పనులు కల్పించడమే గగనంగా మారుతోంది. చేసిన వర్కులకు వేతనాలను ఇవ్వడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోంది. దాదాపు రెండు నెలలుగా వీరికి ఇవ్వని పరిస్థితి నెలకొంది. సుమారు రూ.60 కోట్లకుపైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
పనులకు ముఖం చాటేస్తూ..
బకాయిలను చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు శ్రామికులు ఏ మాత్రం ఆసక్తి చూపడంలేదు. మూడేళ్ల క్రితం వరకు నిత్యం లక్ష మందికిపైగా కూలీలు హాజరయ్యే వారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 38 వేలకు మించి దాటడంలేదు. రెండు నెలల క్రితం వరకు కూడా దాదాపు 50 వేల మంది వచ్చేవారు. ఎండల తీవ్రత, పని ప్రదేశాల్లో సౌకర్యాలను కల్పించకపోవడం, వేతనాలు అందకపోవడం.. ఇలా పలు కారణాలతో వ్యవసాయ, ఇతర వర్కులకు అధిక శాతం మంది వెళ్తున్నారని తెలుస్తోంది.
నిబంధనలు బేఖాతర్
వాస్తవానికి వీబీ జీరామ్‌జీ పథకం నిబంధనల మేరకు పనులు చేసిన వారికి 15 రోజులకోసారి వారి బ్యాంక్ ఖాతాల్లో వేతనాలను జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటోంది. పాత బకాయిలు రూ.36 కోట్లు.. వీబీ జీరామ్‌జీకి సంబంధించి రూ.24 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కూలిలు అందక వీరు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది.
ఉద్యోగుల పరిస్థితీ ఇంతే..
వీబీ జీరామ్‌జీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఎఫ్‌ఏలకూ జీతాలు రెండు నెలలుగా లేవు. ఈ పథకం అమల్లో డ్వామా పీడీ, ఏపీడీ, ఎఫ్‌ఎం, ఏఓలు, సూపరింటెండెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, బీఎఫ్టీలు, ఎఫ్‌ఏలు పనిచేస్తున్నారు. వీరందరికీ జీతాలు అందలేదు. కార్యాలయాల నుంచి క్షేత్రస్థాయి వరకు సుమారు 1400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో పిల్లల ఫీజులు, ఈఎమ్‌ఐలు, ఇలా ప్రతి దానికీ వీరు అగచాట్లు పడాల్సి వస్తోంది. వేతనాలను త్వరితగతిన అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చెల్లించేలా చర్యలు
వీబీ జీరామ్‌జీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులకు వేతన బకాయిల రూపంలో దాదాపు రూ.60 కోట్లను చెల్లించాల్సి ఉంది. వీటిని మంజూరు చేయించేలా చర్యలు చేపడతాం. ఉన్నతాధికారులతో మాట్లాడుతూ... సాధ్యమైనంత త్వరగా చెల్లించేలా చూస్తాం. శ్రామికులందరూ పనులకు హాజరుకావాలి.
– శ్రీనివాసప్రసాద్, పీడీ, డ్వామా
రెండు నెలలుగా అందని
వేతనాలు
రూ.60 కోట్లకుపైగా బకాయిలు
పథకాన్ని మార్పు చేసినా అదే తీరు
వీబీ జీరామ్‌జీకి వచ్చే వారి సంఖ్య
తగ్గుముఖం
వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ జీరామ్‌జీ) పథకానికి హాజరవుతున్న శ్రామికులకు కష్టాలు ఏ మాత్రం తీరడంలేదు. గతంలో అమలవుతున్న పథకాన్ని మార్పు చేసినా, ఎలాంటి పురోగతి లేకపోవడం వీరిని కలవరానికి గురిచేస్తోంది. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వీరికి ఆకలి కేకలు తప్పడంలేదు. దాదాపు రూ.60కుపైగా కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా దీనికి వచ్చేందుకు ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొంది.
వీబీ జీరామ్‌జీ రూల్స్ మేరకు శ్రామికులకు నూతన పనులను చూపాల్సి ఉంది. పంట కాలువలకు సంబంధించిన వర్కులను గతంలో అధికంగా చేసేవారు. అయితే ప్రస్తుతం ఇవి లేకపోవడంతో పంచాయతీల్లో పనులు కల్పించడమే గగనంగా మారుతోంది. ఫలితంగా వీరిని తీసుకొచ్చేందుకు నానా అవస్థ పడాల్సి వస్తోంది. జిల్లాలో జాబ్ కార్డులు కలిగిన శ్రామికులు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు.


