సాక్షి, టాస్క్‌ఫోర్స్: పేదలకు ఇసుక ఉచితమనే మాట కూటమి ప్రభుత్వంలో మచ్చుకై నా కానరావడంలేదు. టన్ను ఇసుకను రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు, కోట, వాకాడు మండలాల్లో ప్రవహించే స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతాల్లో పలు గ్రామాల వద్ద ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు.
తిష్ట వేసిన ప్రైవేట్ సంస్థ
కోట మండలంలోని గూడలి ప్రాంతంలో రీచ్‌ను నామమాత్రంగా ఏర్పాటు చేశారు. అయితే టీడీపీలో అత్యంత కీలక నేతకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ఇక్కడి రీచ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆపై చైన్నె, కర్ణాటకకు ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇందులో స్థానికంగా ఉండే బడా నేతా భాగస్వామ్యం కావడంతో స్థానిక ప్రజాప్రతినిధి తన వాటా తనకొచ్చేస్తుందనే ఉద్దేశంతో స్వామిభక్తిని చాటుకుంటూ మిన్నకుండిపోతున్నారు. నెలవారీ మామూళ్లు అందుతుండడంతో పోలీస్, రెవెన్యూ, గనుల శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
విద్యానగర్ వద్ద డంపింగ్
స్వర్ణముఖికి వరదొస్తే ఇసుకకు ఇబ్బంది పడకుండా ఉండేలా ముందస్తుగానే రీచ్‌కు సమీపంలోని విద్యానగర్ వద్ద డంపింగ్ చేస్తున్నారు. చిట్టమూరు మండలంలోని గునపాడు, గునపాటిపాళెం, జంగాలపల్లి.. చిట్టమూరు మెట్టు సమీపంలోని రొయ్యల వాగు.. కోట మండలంలోని గూడలి, రుద్రవరం, పుచ్చలపల్లి నుంచి నిత్యం వంద ట్రాక్టర్లలో ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. 50 టిప్పర్లు, 16 టైర్ల పెద్ద లారీల్లో దీన్ని పరిశ్రమలు, చైన్నెకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
బ్యారేజీకి చేరని తెలుగుగంగ జలాలు
వాకాడు సమీపంలోని స్వర్ణముఖి బ్యారేజీకి తెలుగుగంగ నీటిని విడుదల చేసి రెండు నెలలవుతోంది. ఇలా వదలడం ద్వారా ఎడగారు సాగుచేసే వారికి బోర్లలో నీరు పుష్కలంగా అందే వీలుంటుంది. వాకాడు మండలంలోని పలు గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులుండవు. అయితే స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో తెలుగుగంగ నీరు బ్యారేజీకు వెళ్లకుండా నాయుడుపేట మండలం వేముగుంటపాళెం వద్ద అడ్డుకట్టేసి రొయ్యల వాగు, పులి కాలువలకు తరలిస్తున్నారు. దీంతో వాకాడు బ్యారేజీలో చుక్క నీరు కానరావడంలేదు.
కోట మండలం గూడలి వద్ద ఇష్టానుసారంగా తవ్వకాలు
యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
చినబాబు కనుసన్నల్లోనే..
రోజూ 40 టిప్పర్లు, 100 ట్రాక్టర్లలో తరలింపు
నిషేధం కాగితాలకే పరిమితం
గూడూరు నియోజకవర్గంలో ఇదీ దుస్థితి
నదుల్లో ఇసుక తవ్వకాలను అక్టోబర్ వరకు జరపొద్దని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జిల్లాలోని అధికార పార్టీ నేతలకు ఇది ఏ మాత్రం వర్తించడంలేదు. రీచ్‌లు దక్కించుకున్న వారితో చేతుల కలిపి ఇష్టానుసారంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం పొంచి ఉంది. అక్రమ తవ్వకాలను గతంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు అడ్డుకోవడంతో కొంతకాలం మిన్నకుండి.. తాజాగా పగలూ, రాత్రనే తేడా లేకుండా ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారు.


