● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
● వైఎస్సార్‌సీపీలో 50 కుటుంబాల చేరిక
నెల్లూరురూరల్: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, అంతే కాకుండా రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని రామ్‌జీ నగర్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో శనివారం 53వ డివిజన్ పార్టీ ఇన్‌చార్జి వెంగళ్‌రెడ్డి నాయకత్వంలో మహిళా నాయకురాలు రాగాల జయమ్మ ఆధ్వర్యంలో రెహనా బేగం, చెవురూ మహేశ్వరి, ఆరవ మంజులమ్మ, పసుపులేటి మహాలక్ష్మి, తుపాకుల ఈశ్వరమ్మతో పాటు వారి అనుచరగణం 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి పర్వతరెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మొదటి నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అందరూ ముందుకొచ్చి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని వారు చూపిస్తున్న చొరవ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. మళ్లీ రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీకి సంబంధించిన జయమ్మ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు పార్టీ చేరడం అభినందనీయమని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. అలాగే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన విధంగా సముచిత న్యాయం, గౌరవం కల్పిస్తామని తెలిపారు.


