పింఛన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించి రోజులు గడుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బాధితుడు కలెక్టర్‌ను కలిసి మరోసారి అర్జీ సమర్పించారు. వివరాలు.. వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన నిమ్మకంటి శంకర్, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు సాయిచరణ్ తొమ్మిదేళ్లుగా తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతూ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. చరణ్‌కు 90 శాతం వైకల్యం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మూడేళ్ల క్రితమే సదరం సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. ఇటీవల చంద్రబాబు వింజమూరు పర్యటనకు వచ్చిన సమయంలో బాధిత తల్లిదండ్రులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అధికారులు స్పందిస్తారని ఆశించిన ఆ పేద కుటుంబానికి నిరాశే ఎదురైంది. దీంతో నెల్లూరుకు వచ్చి అర్జీ సమర్పించారు.


