జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే పాగా వేస్తున్నారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి అక్రమాలకు తెరతీస్తున్నారు. ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చి పాసుపుస్తకాలను సైతం మంజూరు చేస్తున్నారు. తాజాగా దగదర్తి మండలం ఉలవపాళ్లలో జాతీయ రహదారి పక్కనున్న రూ.20 కోట్ల విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారుల సహకారంతో స్థానిక నాయకులు స్వాహా చేయడం సంచలనంగా మారింది.
సర్వేయర్ సంతకం లేని ఎఫ్‌ఎంబీ
పరిశీలించి
చర్యలు చేపడుతాం
దగదర్తి మండలం ఉలవపాళ్లలోని ప్రభుత్వ భూముల వ్యవహారం నా దృష్టికి రాలేదు. ఈ విషయమై సమగ్ర పరిశీలన చేపట్టి తగిన చర్యలు చేపడుతాం.
– ఎలీషా, ఆర్డీఓ, కావలి
నెల్లూరు (దర్గామిట్ట): దగదర్తి మండలం ఉలవపాళ్లలో జాతీయ రహదారికి ఆనుకుని సర్వే నంబరు 86లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని రెండు దశాబ్దాల క్రితం ‘వకార్ యూనస్ మైన్స్ అండ్ మినరల్స్’ పేరుతో ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి మైనింగ్ కోసం తీసుకున్నారు. అక్కడ 8 ఏళ్ల పాటు మైనింగ్ సాగింది. ఆ తరువాత ఖాళీగా ఉన్న సదరు భూమిపై ఇద్దరు స్థానిక నాయకులు కన్నేశారు. అందులో ఆరెకరాలను గతంలో మండలాధికారుల సహకారంతో అక్రమంగా క్రమబద్ధీకరించి స్వాహాపర్వానికి తెరతీశారు.
మొదట నో.. ఆ తరువాత ఎస్
తాజాగా ఉలవపాళ్లలోని సర్వే నంబరు 86లోని మరో 14 ఎకరాల భూమిని స్వాహా చేసేందుకు స్థానిక నాయకులు స్కెచ్ వేశారు. అందుకోసం ఎకరాకు రూ.30 వేల చొప్పున రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పి పని చక్కబెట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోగా తొలుత రెవెన్యూ అధికారి ఫైల్‌ను తిరస్కరించారు. ఆ తరువాత నగదు ముట్టజెప్పడంతో సదరు అధికారి తిరిగి ఫైల్‌ను ఓకే చేసినట్లు సమాచారం.
నిబంధనలకు తూట్లు
ఎఫ్‌ఎంబీపై మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్ గానీ సంతకం చేయలేదు. కనీస క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే తహసీల్దార్ సంతకం చేయడం గమనార్హం. జిల్లాలో ఈ నెల 1న ముఖ్యమంత్రి పర్యటనలో అధికారులంతా బిజీగా ఉండగా, అత్యంత రహస్యంగా, వేగంగా ఫైల్‌ను కదిలించి పాసుపుస్తకాలు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వాటాల కోసం పంచాయితీ
దగదర్తి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ భూముల అక్రమ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కార్యాలయంలోని ఓ ఉద్యోగి కీలకంగా వ్యవహరించగా, రెవెన్యూ సిబ్బంది అందరూ వాటాలు పంచుకున్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారమై ‘నా వాటా సంగతేంటి’ అని మండల సర్వేయర్ ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే పంచాయితీ పెట్టినట్లుగా తెలిసింది. ‘మాకు జీఓలు అన్నీ తెలుసు.. ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ సదరు సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
విచారణ జరిపితే వెలుగులోకి
ప్రస్తుతం జాతీయ రహదారి పక్కన ఎకరా భూమి ధర రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోంది. పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడానికి భూమి లేదంటున్న అధికారులు, ఇలా కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితే రూ.20 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడుకోవడంతో పాటు స్వాహా పర్వం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
దగదర్తి రెవెన్యూ కార్యాలయంలో అక్రమాల పర్వం
రూ. 20 కోట్ల విలువైన భూమి క్రమబద్ధీకరణకు చర్యలు
నిబంధనలకు విరుద్ధంగా
పట్టాదారు పాసుపుస్తకాల జారీ
సర్వేయర్ సంతకం
లేకుండానే ఫైల్ క్లియరెన్స్


