మనుబోలు: మండలంలో సోమవారం వేకువజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు నష్టాన్ని కలిగించింది. మండలంలో రబీ పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో ఆరబోసుకుని ఉన్నారు. ఈ తరుణంలో అకాలం వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. బద్దెవోలు క్రాస్‌రోడ్డు వద్ద పలువురు రైతులకు చెందిన సుమారు 100 పుట్లకుపైగా షుగర్‌లెస్, బీపీటీ రకం ధాన్యం తడిసిముద్దయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఎరువుల కొరతతో బ్లాక్‌లో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసి వేయడంతో ఎకరాకు సుమారు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు అయ్యాయి. దీనికితోడు ధాన్యం ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సగం ధరకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.


