సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు కరైకల్‌కు చెందిన బోట్లను వదిలేసిన వ్యవహారంలో తెరవెనుక సూత్రధారులు ఎవరో తేలిపోయింది. ఇందులోని పాత్రధారులను సభ మధ్యలో నిలబెట్టి నిలదీశారు. తాము తప్పు చేశామని అంగీకరించినప్పటికీ.. సూత్రధారుల పేర్లను మాత్రం బాధ్యులు బయటకు వెల్లడించలేదు. ఈ వ్యవహారం తేలే వరకు వదిలిపెట్టేది లేదని, చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మత్స్యకార పెద్దలు హెచ్చరికలు చేసినా.. అర్ధరాత్రి దాకా హైడ్రామా నడిచింది. అర్ధరాత్రి సమయంలో నిందితుల్లో ఒకరైన నెల్లూరు జిల్లా ఇస్కపల్లిపాళెం మత్స్యకార గ్రామానికి చెందిన తోటయ్య వెల్లడించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు చెప్పడం వల్లే చేశామని, తమకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలిచ్చినట్లు చెప్పారు. దీంతో ఈ ఘటన వెనుక ఉన్న కీలక సూత్రధారి ఎవరో తేలిపోవడంతో తర్వాతి పరిణామాలపై మత్స్యకారులు చర్చిస్తున్నారు.
గత నెల 14న జువ్వలదిన్నె హార్బర్‌లో మైరెన్ పోలీసుల రక్షణలో ప్రకాశం జిల్లా మత్స్యకారులు పట్టుకున్న తమిళనాడు బోట్లు మాయమయ్యాయి. ఈ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల పంచాయతీ పోతయ్యగారిపట్టపుపాళెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 164 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు జిల్లాల నుంచి బస్సులు, వ్యాన్ లు, మోటారు సైకిళ్లపై వేలాదిగా తరలివచ్చారు. ఈ సంఘటన జరిగిన రోజు ఘటనకు ప్రధాన కారకులైన నెల్లూరు జిల్లా ఇస్కపల్లిపాళెం మత్స్యకార గ్రామానికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాళేనికి చెందిన జాలిరెడ్డి, పాతపాళేనికి చెందిన శెట్టిలను సమావేశంలో నిందితులుగా నిలబెట్టారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించాలని మత్స్యకార పెద్దలు ఆదేశించారు. దీనికి ఆ ముగ్గురు ‘తాము తప్పు చేశామని బహిరంగంగా ప్రకటించారు’. అయితే ఎవరు చెబితే వదిలేశారో చెప్పడం లేదు. ఈ ఘటనకు వెనకాల ఎవరు ప్రధానపాత్ర పోషించారు, ఏం జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొంతమంది మత్స్యకార కాపులు జరిమానాతో సరిపెడదామని అంటుండగా ఈ ఘటనకు వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరో చెప్పాలని, ఎంత మొత్తం చేతులు మారిందో తెలపాలని సమావేశానికి హాజరైన సింహభాగం మత్స్యకార కాపులు పట్టుబట్టారు.
ఒక్కొక్కరిది ఒక్కో మాట
సోనాబోట్ల అపహరణలో ప్రధాన నిందితులైన ఇస్కపల్లిపాళేనికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాళేనికి చెందిన జాలిరెడ్డి, పాతపాళేనికి చెందిన శెట్టి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. ఒకరు ఇటీవల లోకేశ్ పర్యటన సందర్భంగా హార్బర్‌లో బోట్లు అడ్డంగా ఉన్నాయని, వాటిని పక్కకు జరపాలని కావలి సీఐ వాటిని తీసుకుని వెళ్లటానికి అనువుగా ఏర్పాటు చేశాడని చెప్పగా.. మరొకరు ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. మూడవ వ్యక్తి తోటయ్య మాత్రం తనకు తెలుగు వచ్చినప్పటికీ ఇతర భాషలో మాట్లాడే ప్రయత్నం చేయటంతో సీఐతో మాట్లాడటానికి తెలుగు వచ్చుకానీ ఇప్పుడు మాత్రం తెలుగు రాదా అని మత్స్యకారులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార పెద్దలు 8 నెలల నుంచి తాము ఏవిధంగా ప్రాణాలకు తెగించి సోనాబోట్లను అదుపులోకి తీసుకుందీ వివరించారు. వాటిని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచి వాటి కాపలా బాధ్యతను ఇస్కపల్లిపాళెం, కొత్తబంగారుపాళెం, తాటిచెట్లపాళెం, పాతపాళెం మత్స్యకారపాళాలకు అప్పగించి ముగ్గురిని కాపలాగా ఉంచామన్నారు. అంతేకాక ఈ బోట్లను విడిపించటానికి సోనాబోట్ల యజమానులు ఒక్కో బోటుకు రూ.15 లక్షలు ఇస్తామన్నా తాము వదల్లేదన్నారు. ఈ ఘటనకు ఆ నాలుగు మత్స్యకార గ్రామాల పెద్దలు కూడా బాధ్యత వహించాలని ప్రకటించగా వారు కూడా అందుకు సమ్మతించారు. ఎన్నో సంవత్సరాలుగా సోనాబోట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయామని తాము తెగించి సమైక్యంగా బోట్లను అదుపులోకి తీసుకుంటే ఈ విధంగా చేశారని మత్స్యకార పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అర్ధరాత్రి వరకు నడిచిన హైడ్రామా అనంతరం సూత్రధారి బీద మస్తాన్‌రావు అని తేల్చి చెప్పడంతో తర్వాత కార్యాచరణపై మత్స్యకారులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా సుమారు 100 మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సమావేశం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మొదట పోలీసులు, విలేకరులకు అనుమతి ఉండదని ప్రకటించినప్పటికీ ఆ తరువాత విలేకరులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
సూత్రధారులెవరో వెల్లడించిన నిందితుల్లో ఒకరు
టీడీపీ రాజ్యసభ్యుడు బీద మస్తాన్‌రావే అని వెల్లడి
ఒక్కొక్కరికి రూ.10 లక్షలిచ్చినట్లు ఒప్పుకోలు
జువ్వలదిన్నె హార్బర్‌లో సోనాబోట్ల అపహరణపై మత్స్యకారుల సమావేశం
నిందితులను నిలబెట్టి నిలదీసిన పెద్దలు
నాలుగు బోట్లను తిరిగి తేవాలని మత్స్యకార పెద్దల డిమాండ్
సమావేశానికి హాజరైన 164 గ్రామాల మత్స్యకారులు


