నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్‌లో సోమవారం ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమం జరిగింది. ఎనిమిది మంది తమ ఫిర్యాదులను ఎస్‌ఈ రాఘవేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఫ్యూజ్ బాక్స్ ఏర్పాటు, విద్యుత్ బిల్లింగ్, లో ఓల్టేజీ, సర్వీసుల ఏర్పాటు లాంటి సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ శ్రీధర్, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరపతయ్య, నరసింహారావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
‘శ్రీరామ’ విద్యార్థినికి
గోల్డ్ మెడల్
తిరుపతి సిటీ: కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఎస్.భావన ప్రతిభ చూపారు. ఏఐ – డేటా సైన్స్‌లో 87.58 శాతం మార్కులతో బంగారు పతకం సాధించారు. సోమవారం అనంతపురం జేఎన్‌టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, విభాగాధిపతి డాక్టర్ స్వప్నసుధ భావనకు అభినందనలు తెలిపారు.
ఆర్థిక సమస్యలతో
వ్యక్తి ఆత్మహత్య
ఆత్మకూరు: ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆత్మకూరు పట్టణంలోని మేదరివీధి కాలనీలో జరిగింది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. మేదరవీధికి ఎగువ ప్రాంతంలో ఉంటున్న షేక్ నిషాద్ (51) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. ఖర్చుల కోసం తన స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు. మరోనెల రోజుల్లో వివాహం ఉందనగా స్థలం అమ్ముడుపోకపోవడం, ఇతర ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. సోమవారం భార్యను బ్యాంక్ వద్దకు పంపి ఇంట్లోని వెనుకవైపు దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంక్ నుంచి ఇంటికొచ్చిన భార్య నిషాద్‌ను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
కండలేరులో
45.920 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 45.920 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 350, లోలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
పొదలకూరు
నిమ్మధరలు (కిలో)
పెద్దవి: రూ.120
సన్నవి: రూ.90
పండ్లు: రూ.70


