నెల్లూరు(దర్గామిట్ట): రెవెన్యూ శాఖలో గ్రేడ్–1 వీఆర్వోగా విధులు నిర్వహిస్తూ మరణించిన షేక్ జాఫర్ కుమారుడు షేక్ యాసిన్‌బాబుకు జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామక పత్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం అందజేశారు. కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో యాసిన్‌బాబుకు నియామకపత్రాన్ని శుభాకాంక్షలు తెలిపారు.
15లోగా ‘విద్యాంజలి’లో
అప్‌లోడ్ చేయాలి
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రధానోపాధ్యాయులు గుర్తించి విద్యాంజలి పోర్టల్‌లో ఈ నెల 15వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాంజలి పథకం ద్వారా ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లుగా చెప్పారు. దాతలు నేరుగా ఈ పోర్టల్ ద్వారా పాఠశాలలను ఎంచుకుని సహకారం అందించవచ్చన్నారు. పోర్టల్ ద్వారా నగదు రూపంలో విరాళాలు సేకరించరని, కేవలం వస్తువులు, సేవల రూపంలో మాత్రమే సహకారాన్ని కోరుతున్నట్లుగా చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి సహకారం అందించాలనుకునే వారు పోర్టల్‌ను సందర్శించి వలంటీరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యాంజలి పథకం ద్వారా గదుల నిర్మాణం, మరమ్మతులు, ఫర్నీచర్, విద్యాసామగ్రి, తదితరాలను అందించేందుకు దాతలు ముందుకురావాలని కరారు.
ఘనంగా జాతీయ
సముద్ర దినోత్సవం
ముత్తుకూరు(పొదలకూరు) : ముత్తకూరు మండలంలోని అదాని కృష్ణపట్నం పోర్ట్‌లో జాతీయ సముద్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సముద్ర రంగంలో పనిచేసే వారి అమూల్యమైన సేవలను ప్రశంసించారు. సముద్ర రంగం రవాణా, వాణిజ్య, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందన్నారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది, కస్టమ్స్ అధికారులు, వ్యాపార భాగస్వాములు, ఓడరేవు ఉద్యోగులు స్థానికులతో కలిసి భద్రత, సామర్థ్యం, పర్యావరణ అనుకూలత కట్టుబాట్లను పునరుద్ఘాటిస్తూ సముద్ర వారసత్వానికి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం సామూహికంగా మొక్కలు నాటారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,271 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,018 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3, 78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


