● నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే నిందితులు హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు శనివారం నెల్లూరు మూలాపేటలోని తన కార్యాలయంలో కేసు పూర్వాపరాలను వెల్లడించారు. దగదర్తి మండలం పెద్దపుత్తేడుకు చెందిన వెంకటేష్(29), బుచ్చిరెడ్డిపాళెం కాగులపాడు గ్రామానికి చెందిన బాల అంకయ్య(25)లు వరుసకు అన్నదమ్ములు. వారు గత నెల 29వ తేదీన కొడవలూరు మండలం గండవరం గ్రామ శివారుల్లోని పొలాల వద్ద దారుణ హత్యకు గురైన విషయం విదితమే. నెల్లూరు రూరల్ డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడింది దగదర్తి మండలం పెద్దపుత్తేడు గ్రామానికి చెందిన ప్రశాంత్‌కుమార్, కల్యాణ్‌కుమార్, విజయ్‌భాస్కర్, ప్రకాష్, శీనయ్యలుగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలో నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించారు. మృతుడు వెంకటేష్‌కు నిందితుల బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో వారు వెంకటేష్‌పై కక్షపెంచుకున్నారు. ఈనెల 29వ తేదీన వెంకటేష్, బాల అంకయ్యలు డీజిల్ తీసుకుని బైక్‌పై వెళ్తుండగా గండవరం గ్రామశివార్లలో బైక్‌ను నిందితులు అడ్డుకున్నారు. రాడ్లు, కత్తితో వెంకటేష్‌పై దాడి చేస్తుండగా అడ్డుపోయిన బాల అంకయ్యపై సైతం దాడి చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రాడ్లు, కత్తి, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో బుచ్చి సీఐ ఒ.దుర్గాప్రసాద్, కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి పాల్గొన్నారు.


