కోట: కోట చెరువు సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై శోభారాణి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వెంకన్నపాళెం గ్రామానికి చెందిన పెంచలయ్య(45)గా గుర్తించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.
బైక్ అదుపుతప్పి
ఇద్దరికి గాయాలు
మర్రిపాడు: బైక్ అదుపుతప్పి పడి ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని 565 జాతీయ రహదారిపై బాట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి 108 సాయంతో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వేగం, మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


