● రాష్ట్ర మహిళా కమిషన్
చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
● నెల్లూరులో జన సున్వాయి
నెల్లూరు(పొగతోట): సమాజంలో ప్రస్తుతం గృహహింస కేసులు అధికంగా ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జన సున్వాయి కార్యక్రమం జరిగింది. మహిళా కమిషన్ కార్యాలయం నుంచి 12 కేసులకు నోటీసులిచ్చారు. వాటిలో నలుగురు మహిళలు హాజరయ్యారు. 30 మంది వివిధ సమస్యలపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శైలజ మాట్లాడుతూ పోలీస్ అధికారులు జీరో ఎఫ్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ఆర్డీఓ అనూష చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, లీగల్ కౌన్సెలర్ పూజిత, సీఐ సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి పాల్గొన్నారు.
సమస్యలు చెప్పి..
రంగనాయకులపేటకు చెందిన ఓ మహిళ తన భర్త ఇబ్బంది పెడుతున్నాడని, కుమారుడిని, తనను పట్టించుకోవడం లేదన్నారు. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నానని భరణం ఇప్పించి, విడాకులు మంజూరు చేయించాలని కోరారు. తనును ప్రభు త్వ ఉద్యోగి ఇబ్బంది పెడుతున్నాడని న్యాయం చేయాలంటూ కోరుతూ నగరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. లాయర్ అయిన తనకే న్యాయం జరిగలేదని ఓ మహిళ సమస్యను వెల్లడించారు. కొందరు ఇంటివద్ద ఉన్న నాపై, భర్తపై దౌర్జన్యం చేసి దాడి చేసి 10 సవర్ల బంగారం లాక్కెళ్లారని వాపోయారు. ఈ విషయంపై కేసు పెట్టినా కొట్టి వేశారని, మనం ఏ కాలంలో ఉన్నామని లాయర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఇబ్బందులు పెడుతున్నారని ఓ తల్లి అర్జీ ఇచ్చారు. భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. మీ భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తాం. ఇద్దరూ కలిసి ఉండేలా చర్యలు తీసుకుంటామని కమిషన్ చెప్పినా ఆమె వినలేదు. భర్త వల్ల పడరాని పాట్లు పడుతున్నానని తల్లిదండ్రులతో వచ్చి ఫిర్యాదు చేశారు. కార్యాలయాల్లో అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళా ఉద్యోగులు అర్జీ ఇచ్చారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించారు.


