సారూ.. మీరైనా దయ చూపండి | - | Sakshi
Sakshi News home page

సారూ.. మీరైనా దయ చూపండి

Mar 10 2026 1:25 PM | Updated on Mar 10 2026 1:25 PM

అధికారులను కోరిన అర్జీదారులు

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

నెల్లూరు(అర్బన్‌): ‘సారూ.. మా సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరిగాం. అక్కడ స్పందన లేదు. మీరైనా దయ చూపండి’ అని అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్‌ కిటకిటలాడింది. ప్రజల నుంచి కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ మురళి తదితరులు వినతులు స్వీకరించారు.

చర్యలు తీసుకోవాలి

వరికుంటపాడు, పక్కనే ఉన్న భాస్కరాపురం గ్రామాల మధ్య ప్రభుత్వానికి చెందిన 47 ఎకరాల భూముల్లో తెల్లరాయి తవ్వకాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తూ గత సంవత్సరం ఆగస్టులో ర్యాలీకి సిద్ధపడ్డారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్‌ తరఫున ఉండి ప్రజలపై దౌర్జన్యాలు చేశారు. దీంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకెళ్లగా కోర్టు ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అధికారులుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా ఎలాంటి చర్యల్లేవు. కలెక్టర్‌ స్పందించి కోర్టు తీర్పునకు అనుగుణంగా రెండు గ్రామాల ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు చేపట్టాలి. – నల్లగొండ్ల మాల్యాద్రి,

వరికుంటపాడు గ్రామం

బ్లాక్‌లో వంట గ్యాస్‌ విక్రయం

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పలు గ్యాస్‌ ఏజెన్సీలు కమర్షియల్‌ సిలిండర్లను బ్లాక్‌ చేశాయి. అందుబాటులో లేవంటూ అధిక రేటుకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. సిలిండర్‌పై అదనంగా రూ.700 నుంచి రూ.1,000 వరకు డిమాండ్‌ చేస్తున్నారు. మాకు వ్యాపారాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం. అధిక భారం మోయాల్సి వచ్చింది. మరింత రేట్లు పెరుగుతాయని ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమంగా బ్లాక్‌ మార్కెట్‌ను సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచాలి.

– అర్షద్‌, యాదవ్‌కుమార్‌రెడ్డి, సుందర్‌నాయుడు, కృష్ణనాయుడు హోటళ్లు, ధాబాల నిర్వాహకులు

గోషా ఆస్పత్రిని పూర్తి చేయాలి

నెల్లూరులోని పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఏడేళ్ల క్రితం గోషా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రహరీ నిర్మించారు. లోపల చిన్నపాటి ఆస్పత్రిలా అరకొర నిర్మాణాలు జరిపారు. దీంతో ప్రజలకు వైద్య సౌకర్యాలు స్థానికంగా అందడం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్ణీత కాలపరిమితి లోపు పూర్తి నిర్మాణాలు జరిపి ప్రారంభోత్సవం చేసి వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలి.

– మధు, అజీజ్‌, అహ్మద్‌బాషా,

లీలామోహన్‌, సీపీఐ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement