● న్యాయం కోసం పీజీఆర్‌ఎస్‌లో మహిళ వినతి
నెల్లూరు(క్రైమ్): ‘చెడు వ్యసనాలకు బానిసైన నా భర్త అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడు. నన్ను, పిల్లలను పట్టించుకోవడంలేదు. ఇటీవల ఇంటి నుంచి గెంటేశాడు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఓ వివాహిత కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 161 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా దృష్టి సారించాలని పలువురు ఉన్నతాధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ యు.సత్యనారాయణ, డీసీఆర్‌బీ, పీసీఆర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు ఎన్.రామారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా భర్త చనిపోయాడు. కుమారుడు నా దగ్గరున్న 8 సవర్ల బంగారు ఆభరణాలు, పీఎఫ్ అకౌంట్‌లోని నగదు తీసుకున్నాడు. నాకు జీవనాధారం కష్టంగా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టేందుకు వస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలని ముత్తుకూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● నా భర్త నిత్యం వేధిస్తుండటంతో జనవరిలో పోలీసుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారించి న్యాయం చేయాలని కోటకు చెందిన ఓ వివాహిత కోరారు.
● అమెరికాలో క్విక్ అకౌంట్ ద్వారా భారీ లాభాలు వస్తాయని అశ్విన్, నితిన్‌రెడ్డి నా వద్ద రూ.60 వేలు తీసుకుని మోసగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.


