● కలెక్టరేట్‌లో డీవైఎఫ్‌ఐ ధర్నా
నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, ఎంవీ రమణ డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆ సంఘానికి చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా ఖజనాలో డబ్బుల్లేవంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడపడం సిగ్గు చేటని విమర్శించారు. సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం వాటి సంగతి మర్చిపోయిందన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే, ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తిరుపతి, జగదీష్, హర్ష, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


