
హామీలు నెరవేర్చాలని డిమాండ్
● నెల్లూరులో న్యాయవాదుల నిరసన
నెల్లూరు(లీగల్): ‘జూనియర్ లాయర్లకు రూ.10 వేలు, సంక్షేమనిధికి రూ.100 కోట్లు, న్యాయవాదులకు ఇంటి స్థలం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అవి హామీలుగానే మిగిలిపోయాయి. తక్షణమే వాటిని నెరవేర్చాలి’ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆరిగెల నాగేంద్రసాయి డిమాండ్ చేశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేలు స్టై ఫండ్, న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.25 కోట్లు ఇచ్చిందన్నారు. జిల్లా శాఖ జనరల్ సెక్రటరీ బ్రహ్మం మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి తేవాలన్నారు. హైకోర్టు బెంచ్‌ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర బార్ కమిటీ న్యాయవాదులకు ఇస్తున్న డెత్ బెనిఫిట్ మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, జాయింట్ సెక్రటరీ జేఎల్ నారాయణ, షేక్ యస్దానీ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.