కూటమి గుప్పెట్లో ‘సోషల్ ఆడిట్’
నెల్లూరు(పొగతోట): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం కూటమి నేతల కనుసన్నల్లో నడుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి రికవరీలు విధించేలా చక్రం తిప్పుతున్నారు. ఇటీవల కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఎక్కడంటే..
దగదర్తి మండలంలోని ధర్మవరం, చెన్నూరు, తురిమెర్ల, బోడగుడిపాడు ఫీల్డ్ అసిస్టెంట్లపై టీడీపీ నాయకులు కక్ష కట్టారు. వారితో ఎలా అయినా రాజీనామా చేయించాలని నిర్ణయించుకుని గ్రామసభల్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇటీవల ఆ మండలంలో సోషల్ ఆడిట్ జరిగింది. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండే సర్పంచ్‌లు దీనికి హాజరయ్యారు. అక్కడున్న టీడీపీ నాయకులు మీకేం సంబంధమంటూ వారిని అడ్డుకున్నారు. వెళ్లిపోవాలంటూ హెచ్చరించి గొడవకు దిగారు.
ఒక్కోచోట ఇలా..
ఇటీవల ధర్మవరంలో గ్రామ సభ జరిగింది. ఇందులో టీడీపీకి అనుకూలంగా ఉండే వారు పనులకు హాజరైనా రాలేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సభ జరగక ముందే ఎఫ్‌ఏను రాజీనామా చేయాలని, లేకపోతే రూ.లక్షల్లో రికవరీలు విధించి కేసులు నమోదు చేయిస్తామంటూ హెచ్చరించి ఉన్నారు. అయితే ఎఫ్‌ఏ వినకపోవడంతో రూ.2 లక్షలకు పైగా రికవరీ విధించినట్లు సమాచారం. చెన్నూరు గ్రామసభలో సర్పంచ్‌కు బదులు ఆమె భర్త అంతా తానై వ్యవహరించాడు. ఆయనతోపాటు టీడీపీ నాయకుడు వేదికపై కూర్చొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించుకునేలా ప్రయత్నించారు. తురిమెర్ల సభలో ఫీల్డ్ అసిస్టెంట్‌పై టీడీపీ నాయకులు తిట్ల పురాణానికి దిగారు. దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. రాజీనామా చేయమంటే చేయవా? అంత అహంకారమా? నీ అంతు చూస్తామంటూ నేతలు బెదిరింపులకు దిగారు. బోడగుడిపాడుకు హౌసింగ్ శాఖ వారు తప్పు చేస్తే రికవరీ మాత్రం ఎఫ్‌ఏపై పడింది.
చర్యలు వారిపైనేనా..
సంవత్సరం పాటు ఉపాధి కూలీలు పనిచేసిన రోజులకు సంబంధించి పేమెంట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమై ఉన్నాయి. అధికారులు దీనిపై దృష్టి పెట్టకుండా టీడీపీకి అనుకూలంగా ఉండే వారి ఫిర్యాదుల ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.లక్షల్లో రికవరీలు విధిస్తున్నారు. పనులకు రాలేదని సోషల్ ఆడిట్‌లో చెప్పినంత మాత్రన విచారించకుండా రికవరీలు వేయడంపై ఎఫ్‌ఏలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులకు వచ్చి రాలేదని అబద్ధాలు ఆడిన టీడీపీ మద్దతుదారులపై విచారించి బ్యాంక్ స్టేట్‌మెంట్ తీస్తే ఎవరు పొరపాటు చేశారో తెలిసిపోతుంది. అయితే అధికారులు అటువైపుగా ఆలోచన చేయడం లేదు. కూటమి నేతలు చెప్పిందే చేస్తున్నారు. సామాజిక తనిఖీల్లో రికవరీలు విధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, సీఓలు, ఏపీఓలు జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాన అనంతరం ప్రజాప్రతినిధులు చెప్పిన వారిని ఎఫ్‌ఏలుగా నియమించేందుకు సామాజిక తనిఖీల్లో రికవరీలు విధించడం పరిపాటిగా మారింది. ఈ సమస్యను విన్నవించుకునే అవకాశాలను ఇవ్వడం లేదు. వీటి ఫలితంగా వందలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
విచారించి చర్యలు తీసుకుంటాం
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సోషల్ ఆడిట్ జరుగుతోంది. అధిక శాతం మండలాల్లో పూర్తయ్యాయి. రికవరీలు విధించిన సిబ్బందిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం. పూర్తి వివరాలను సేకరించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– గంగాభవాని, డ్వామా పీడీ
టీడీపీ నేతల ఇష్టారాజ్యం
తమకు అనుకూలంగా ఉండే వారితో ఎఫ్‌ఏలపై ఫిర్యాదు
రూ.లక్షల్లో రికవరీలు విధిస్తున్న వైనం
ఆవేదన చెందుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు


