కాకాణిపై కొనసాగుతున్న వేధింపులు
నెల్లూరు(క్రైమ్): మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వేధింపులను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆ పార్టీ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో తప్పుడు కేసులతో వేధిస్తోంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని, ఇందులో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, దీనికి ఆయన సహకరించారంటూ 120 (బీ), 447, 427, 379, 290, 506, 109 ఆర్ / డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఏ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21 (1), 21 (4) ఆఫ్ ఎమ్మెమ్డీఆర్ యాక్ట్ కింద నాన్‌బెయిలబుల్ కేసును పొదలకూరు పోలీసులు ఇటీవల నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏ – 4గా ఉన్నారు. కొద్ది రోజులుగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచార నేపథ్యంలో, అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడేదిలేదంటూ తన ఇంట్లోనే ఆయన ఉన్నారు. ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులు పగలూ, రాత్రీ పహారా కాశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో ఉగాది పర్వదిన నేపథ్యంలో కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు శుక్రవారం వెళ్లి వేడుకలను ఆదివారం జరుపుకొన్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాకాణిని ఇబ్బందులు పెట్టాలంటూ పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులను పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి జారీ చేశారు. ఎస్సై హనీఫ్ తన సిబ్బందితో కలిసి మీడియాను వెంటబెట్టుకొని డైకస్‌రోడ్డులోని కాకాణి ఇంటికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులను అంటించి వెళ్లారు.
విచారణకు హాజరుకావాలి
విచారణ నిమిత్తం మూలాపేటలోని రూరల్ డీఎస్పీ కార్యాలయానికి సోమవారం ఉదయం 11కు హాజరుకావాలని నోటీసులో పొందుపర్చారు. కాకాణి బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఓ పథకం ప్రకారమే నోటీసులను జారీ చేశారు. విచారణకు ఆయన సహకరించడంలేదనే సాకును చూపేందుకే నోటీసులను అంటించారని తెలుస్తోంది.
విచారణకు నేడు హాజరుకావాలి
ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
కాకాణిపై కొనసాగుతున్న వేధింపులు


