
ఈత కొట్టేందుకు పెన్నా నదిలో దిగి..
● బాలుడి మృతి
నెల్లూరు(క్రైమ్): స్నేహితులతో కలిసి పెన్నానదికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తడికలబజారు ప్రాంతంలో శ్రీదేవి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె పెద్ద కుమారుడు నందకిశోర్ తొమ్మిదో తరగతి, చిన్నకుమారుడు మహీధర్ (14) ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మహీధర్ తన స్నేహితులైన కిరణ్‌కుమార్, రోహన్‌కుమార్, సాయి, చరణ్ తదితరులతో కలిసి పెన్నానదికి వెళ్లాడు. అందరూ కలిసి తిక్కన పార్కు సమీపంలో నదిలో చేపలు పట్టారు. తర్వాత ఈతకొట్టేందుకు నదిలో దిగే క్రమంలో మహీధర్ ప్రవాహంలో చిక్కుకుపోగా ఇంతలో అక్కడకు చేరుకున్న నందకిశోర్ రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. మహీధర్ నీటిలో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంతపేట ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారుడు గల్లంతైన విషయం తెలుసుకున్న శ్రీదేవి తన భర్త వంశీ, బంధువులతో కలిసి పెన్నానదికి చేరుకున్నారు. అందరూ కలిసి బాలుడి కోసం గాలించారు. కొద్దిసేపటికి మహీధర్‌ను గుర్తించి బయటకు తీసుకొచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు.