
ప్రజలందరి సహకారంతో స్వచ్ఛాంధ్ర లక్ష్యం
నెల్లూరు (బారకాసు): ప్రజలందరి సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం నగరంలోని తడికల బజార్ సెంటర్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలందరూ కంకణ బద్ధులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో రోడ్ల నిర్మాణంలో కూడా ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ వినియోగించనున్నట్లు చెప్పారు.
ప్లాస్టిక్ వాడకం కేన్సర్‌కు కారణం
: కమిషనర్ సూర్యతేజ
ప్లాస్టిక్ వాడకం మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా అత్యంత హానికరమని, కేన్సర్‌కు కారణమని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ అన్నారు. నగరంలోని 54 డివిజన్లలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు భూమిలో కరగవని, వీటిని కాల్చితే ఆ గాలి పీలిస్తే క్యాన్సర్ ప్రబలుతుందని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయోడి గ్రేడ్ కవర్లు, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. అనంతరం స్థానికులకు క్లాత్ బ్యాగులను కలెక్టర్, కమిషనర్ పంపిణీ చేశారు. స్టోన్‌హౌస్‌పేటలో పర్యటిస్తూ ప్రజలకు, దుకాణదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను కలెక్టర్, కమిషనర్ వివరించారు. ప్రజలందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తొలుత ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను వివరిస్తూ దోర్నాల హరిబాబు, శంకర్ స్కిట్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కామాక్షి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి
కలెక్టర్ ఆనంద్
ప్రజలకు క్లాత్ బ్యాగ్‌లు పంపిణీ చేసిన కలెక్టర్, కమిషనర్