● మూడు ద్విచక్ర వాహనాలు, ఏసీ దగ్ధం
నెల్లూరు(క్రైమ్): ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ వాహనంతోపాటు పక్కనున్న మరో రెండు మోటార్‌బైక్‌లకు మంటలు వ్యాపించి దగ్ధమైన ఘటన నెల్లూరు కళ్యాణ్ నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కళ్యాణ్ నగర్ నాలుగో వీధిలో కె.తిరుపతిరెడ్డికి రెండు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఒక పోర్షన్‌లో ఆయన నివాసం ఉంటుండగా మిగిలిన వాటిని అద్దెకు ఇచ్చాడు. తిరుపతిరెడ్డికి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండగా మిగిలిన వారికి వివిధ కంపెనీలకు చెందిన బైక్‌లున్నాయి. అందరూ గ్రౌండ్ ఫ్లోర్‌లో వాటిని పార్క్ చేస్తారు. గురువారం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ నేపథ్యంలో మంటలు పక్కనున్న రెండు ద్విచక్ర వాహనాలకు, గ్రౌండ్ ఫ్లోర్‌లోని గదికి వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన పక్కింటి వారు తిరుపతిరెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆయన అగ్నిమాపక సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రిక్ వాహనంతోపాటు రెండు మోటార్‌బైక్‌లు, ఫర్నిచర్, ఏసీలు కాలిపోయాయి. బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.