
యువతకు అవగాహన : కలెక్టర్
నెల్లూరు(అర్బన్): గంజాయి, గుట్కా, బీడీ, సిగరెట్ తదితర వాటితో కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లో నషా ముక్త భారత్ అభియాన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, జనసంచార ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలు, చట్టపరంగా అమలయ్యే శిక్షలను వివరించాలన్నారు. పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ మహ్మద్ ఆయూబ్, సూపరింటెండెంట్ సంధ్యారాణి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, ఆర్‌ఐఓ వరప్రసాద్, బాలల సంరక్షణాధికారి సురేష్ తదతరులు పాల్గొన్నారు.