జవాబుపత్రాల ట్యాంపరింగ్‌పై విచారణ | - | Sakshi
Sakshi News home page

జవాబుపత్రాల ట్యాంపరింగ్‌పై విచారణ

May 20 2025 11:53 PM | Updated on May 20 2025 11:53 PM

జవాబు

జవాబుపత్రాల ట్యాంపరింగ్‌పై విచారణ

కందుకూరు రూరల్‌: సీనియర్‌ ఇంటర్‌ ఇంగ్లిష్‌ జవాబుపత్రాల ట్యాంపరింగ్‌పై మంగళవారం అధికారులు విచారణ చేశారు. కందుకూరులోని ఓవీ రోడ్డులో శ్రీగాయత్రి జూనియర్‌ కళాశాలకు చెందిన ఎం.అవినాష్‌బాబు, టి.సాయి తేజస్విని అనే విద్యార్థుల జవాబుపత్రాలు ట్యాంపరింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. వీరు పరీక్ష రాసిన పరీక్ష కేంద్రం శ్రీవివేక జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌, ఇన్విజిలేటర్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు విచారించారు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఎస్సీ కార్పొరేషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు సీడాప్‌, లిడ్‌క్యాప్‌ సహకారంతో ఉచితంగా లెదర్‌ స్టిచింగ్‌, కటింగ్‌ ఆపరేటింగ్‌పై శిక్షణ ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి, ఆపై చదివిన 18 – 35 సంవత్సరాల్లోపు యువతీయువకులు శిక్షణ పొందవచ్చన్నారు. శిక్షణా కాలం 45 రోజులు ఉంటుందని, ఈ సమయంలో ఉచితంగా భోజన వసతి కల్పిస్తామన్నారు. అర్హత ఆసక్తి కలిగిన వారు బయోడేటాతోపాటు ఆధార్‌, కుల విద్యార్హతల సర్టిఫికెట్‌ జెరాక్స్‌ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను జత చేయాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా డీఆర్‌డీఏ కార్యాలయంలో, బోగోలులోని వైటీసీ భవనంలో అందజేయాలన్నారు. వివరాలకు 89851 20012, 99497 12982, 94900 80861 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని కోరారు.

మాటల్లో పెట్టి.. కాళ్ల పట్టీలు కొట్టేసి

గంటల వ్యవధిలోనే నలుగురు మహిళల అరెస్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): కాళ్లపట్టీలను అపహరించుకెళ్లిన మహిళలను గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నెల్లూరు చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. కోటమిట్ట మెక్లిన్స్‌ రోడ్డుకు చెందిన డి.చెంచు మునిరెడ్డి ఆచారివీధిలో మేఘనశ్రీ జ్యువెలరీస్‌ను నిర్వహిస్తున్నాడు. సోమవారం నలుగురు మహిళలు అతడి దుకాణానికి వెళ్లారు. వెండి కాళ్లపట్టీలు (గొలుసులు)చూపించాలని అడిగారు. సిబ్బంది వారికి పట్టీలు చూపిస్తుండగా మహిళలు వారిని మాటల్లో దించి రూ.70 వేల విలువైన 740 గ్రాముల ఏడు జతల పట్టీలను దోచుకెళ్లారు. మహిళలు షాపు నుంచి వెళ్లిన తర్వాత పట్టీలు కనిపించకపోవడంతో యజమాని చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై మహబూబ్‌బాషా, క్రైమ్‌ పార్టీ సిబ్బంది చోరీకి గురైన దుకాణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులు రాయచోటి జిల్లా వావిలపాడు మండలానికి చెందిన గీత, జ్యోతి, రవళి, నరసమ్మగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ సమీపంలో వారిని అరెస్ట్‌చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నిరోజుల్లో మాట నిలబెట్టుకుంటారు?

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిర్మల

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నిరోజుల్లో ఆ మాటను నిలబెట్టుకుంటారు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల ప్రశ్నించారు. నెల్లూరు మూలాపేటలోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వారి విషయంలో మంత్రి చూసీచూడనట్లుగా ఉంటున్నారన్నారు. ఇసుక అక్రమ రవాణా, భూముల కబ్జా గురించి తెలిసినా ఏమి తెలియనట్టుగా ఉన్న నారాయణకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వొచ్చన్నారు. కబ్జాకు గురైన సెంటు ప్రభుత్వ భూమినైనా స్వాధీనం చేసుకుని మీడియా సమావేశంలో చెప్పగలరా అని ప్రశ్నించారు. కావాలంటే భూముల్ని తాము చూపిస్తామన్నారు. నెల్లూరు ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. వందల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాలన్నారు.

స్తంభం పడి వ్యక్తి మృత్యువాత

కావలి(జలదంకి): కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డు బొట్లగుంట వద్ద చికెన్‌ పకోడా దుకాణంపైన ఓ వ్యక్తి పట్ట కడుతుండగా విద్యుత్‌ సరఫరా జరిగే స్తంభానికి సపోర్టుగా ఉన్న మరో స్తంభం పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. బొట్లగుంటలోని మద్యం దుకా ణం సమీపంలో పత్తి సుబ్బారావు అనే వ్యక్తి చికెన్‌ పకోడా షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో అతని స్నేహి తుడైన బాలకృష్ణారెడ్డి నగర్‌కు చెందిన మద్దెల వెంకటేష్‌ (34) సాయంతో షాపుపై పట్ట కడుతున్నారు. ఈక్రమంలో సుబ్బారావు స్టూల్‌పై ఉండి విద్యుత్‌ స్తంభానికి పట్ట కడుతుండగా సపోర్టుగా ఉన్న స్తంభం వెంకటేష్‌పై పడింది. దీంతో అతను మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని కావలి రెండో పట్టణ సీఐ గిరిబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కొడవలూరు: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు – పడుగుపాడు స్టేషన్ల మధ్య మంగళవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మృతుడి వయసు 40 – 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కాషాయపు రంగు చొక్కా, పసుపు, మెరూన్‌ రంగుల లుంగీ ధరించి ఉన్నాడు. పొట్టపై ఆపరేషన్‌ చేసిన గుర్తులున్నాయి. మృతుడి వివరాలు సేకరిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

జవాబుపత్రాల ట్యాంపరింగ్‌పై విచారణ1
1/1

జవాబుపత్రాల ట్యాంపరింగ్‌పై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement