
మీ రొయ్యలు మాకొద్దు..
వాకాడు: ఆక్వా రంగంపై మరో పిడుగు పడింది. రసాయనిక అవశేషాలున్నాయని ఎగుమతి చేసిన ఉత్పత్తులను పలు దేశాలు తీసుకునేందుకు నిరాకరించడంతో రైతులు, వ్యాపారులకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. రొయ్యల కంటైనర్లను వెనక్కు పంపుతుండడంతో ఆక్వా పరిశ్రమ కుదేలైంది. ఇటీవల జపాన్, అమెరికా దేశాలకు చైన్నె నుంచి పంపిన 10 కంటైనర్ల రొయ్యలు తిరిగి వచ్చేశాయి. ఒక్కో కంటైనర్‌లో దాదాపు 60 టన్నుల నుంచి 100 టన్నుల వరకు ప్రాసెస్ చేసిన రొయ్యలుంటాయి. వాటిని ఆయా దేశాల నిపుణులు పరీక్షించి యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ రొయ్యలను తింటే చర్మ వ్యాధులతోపాటు, వివిధ రకాల వైరస్ సోకుతుందని వెల్లడించారు. సుమారు రూ.264 కోట్లు విలువైన రొయ్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా వ్యాపారులు నష్టపోయినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక వివిధ రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లతోపాటు స్థానిక మార్కెట్లలో తక్కువ ధరకే విక్రయించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో రైతుల నుంచి కొనుగోళ్లను వ్యాపారులు నిలిపేశారు. కొందరు వచ్చిన ధరకే స్థానికంగా లూజు విక్రయాలు చేయాల్సి వచ్చింది.
58,580 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 వేల మంది ఆక్వా రైతులు ఉన్నారు. అధికారికంగా 35 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 15 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. అలాగే హేచరీలు 97 వరకు ఉన్నాయి. తద్వారా ఏటా 58,580 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. మొదటి సీజన్‌లో 30 వేల టన్నులు, రెండో సీజన్‌లో 28 వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి ఉంటుంది. అయితే కొందరు రైతులు రెండో క్రాప్‌లో కూడా ఎక్కువ దిగుబడి సాధించేందుకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అసలు విషయం గుర్తించకుండా ఎన్ని టన్నుల ఉత్పత్తి పొందామనే లెక్కలు వేసుకుంటున్నారు. ఆ మేరకు ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి విశాఖపట్నం, కాకినాడ, చైన్నె నగరాల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌కు సంబంధించిన పది దేశాలు మన దేశం నుంచి రొయ్యలు దిగుమతి చేసుకుంటున్నాయి. కాగా ప్రధానంగా జపాన్, అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.
ఎగుమతి చేసిన వాటిని వెనక్కి
పంపుతున్న పలు దేశాలు
రసాయనిక అవశేషాలున్నాయని వెల్లడి
చేసేదిలేక తక్కువ ధరకే స్థానికంగా అమ్మేస్తున్న వ్యాపారులు
ఇకపై నూతన లేబులింగ్‌తో
ఎక్స్‌పోర్టుకు శ్రీకారం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో
6 వేల మంది ఆక్వా రైతులు
రవాణాలో కొత్త విధానం
విదేశాలకు ఎగుమతి చేస్తున్న రొయ్యలకు లేబులింగ్ అనే నూతన విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏ ప్రాంతంలో రొయ్యలు సాగు చేశారు. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడారు. ఏ యూనిట్లో ప్రాసెస్ పూర్తి చేశారనే వివరాలను ఆ లేబుల్‌పై పొందుపరచనున్నారు. ఈ క్రమంలో అధికంగా యాంటీబయాటిక్స్ వాడుతున్న రైతులను గుర్తించే వెసులుబాటు ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే ప్రతి కంటైనర్‌లో 50 శాతం శాంపిళ్లను తప్పనిసరిగా పరీక్షించాలని రాష్ట్ర మత్స్యశాఖ నిర్ణయించింది. కొత్త సూక్ష్మజీవుల జాతులుగా మారే అవకాశం ఉంది.

మీ రొయ్యలు మాకొద్దు..