
నేర నియంత్రణకు చర్యలు
నెల్లూరు(క్రైమ్): ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి సాధ్యమని భావించిన పోలీస్ యంత్రాంగం సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పెద్దలు, యువతతో సమావేశాలు నిర్వహించింది. ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుత వాతావరణంలో జీవించాలని గ్రామస్తులకు సూచించారు. మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత చెడువ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, గంజాయితోపాటు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సహకారం అందించాలని గ్రామస్తులను కోరారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై స్థానిక పోలీసులకు, డయల్ 112కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు.