నెల్లూరుకు వందే భారత్‌ రైలు | Vande Bharat Trains At Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరుకు వందే భారత్‌ రైలు

Apr 3 2023 9:07 AM | Updated on Apr 3 2023 9:17 AM

Vande Bharat Trains At Nellore - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): భారత రైల్వే సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్‌ రైలు నెల్లూరు మీదుగా ప్రయాణించనుంది. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరేలా ఈ రైలు సూపర్‌ స్పీడ్‌తో పట్టాలపై పరుగులు తీయనుంది. కాగా ఈ రైలులో ఒక్క సారైనా ప్రయాణించాలని ప్రయాణికులు ఉత్సాహం చూపుతున్నారు. కాగా రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు వందే భారత్‌ రైలు నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆగనుంది.

9 నుంచి రెగ్యులర్‌ సర్వీసులు
ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సికింద్రాబాద్‌లో వందే భారత్‌ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు నేరుగా తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఎక్కడా ప్రయాణికులకు అందుబాటులో ఉండదు. అయితే ఈ రైలు 9వ తేదీన తిరుపతి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఈ రైలు 10వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

130 కి.మీ. స్పీడ్‌కు అనుమతులు
సాధారణంగా ప్రస్తుతం ఉన్న అన్ని సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కేవలం 70 నుంచి 100 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణిస్తాయి. అయితే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం 110 నుంచి 130 కిలోమీటర్ల వరకు స్పీడ్‌ కెపాసిటీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 110 కి.మీ. వేగంతో, ట్రాక్‌ ఇబ్బందులు లేనిచోట్ల 130 కి.మీ. వేగంతో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి.

8 కోచ్‌లు మాత్రమే
ప్రస్తుతం తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌పాస్ట్‌ రైళ్లలో అన్నీ కలిపి 23 కోచ్‌లు ఉంటాయి. కానీ వందే భారత్‌ రైలు సూపర్‌ స్పీడ్‌తో ప్రయాణించనుండడంతో కేవలం 8 ఏసీ కోచ్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పరిస్థితిని బట్టి మరికొన్ని రోజుల్లో కోచ్‌లు పెంచే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సమయాల్లో..
సికింద్రాబాద్‌ – తిరుపతి(20701) వందే భారత్‌ రైలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి – సికింద్రాబాద్‌(20702) వందే భారత్‌ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు సాయంత్రం 5.20 గంటలకు, సికింద్రాబాద్‌కు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది.

దాడులు చేస్తే కఠిన చర్యలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్‌ రైల్లో ప్రయాణికులు కూడా ఉత్సాహంగా ఎక్కుతున్నారు. కాగా కొంతమంది ఇటీవల ఈ రైలుపై దాడులు చేశారు. వివిధ చోట్ల దాడులు చేసిన 39 మందిని ఇటీవల అరెస్ట్‌ చేశాం. అలాంటివి జరిగితే రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – శివేంద్ర మోహన్‌, డీఆర్‌ఎం, విజయవాడ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement