భారత మహిళల పిస్టల్‌ జట్టుకు కాంస్యం

Yashaswini, Manu, Rahi win bronze win Shooting World Cup - Sakshi

ఒసిజెక్‌ (క్రొయేషియా): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండో కాంస్య పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్, రాహీ సర్నోబత్, యశస్విని సింగ్‌లతో కూడిన భారత బృందం మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మనూ, రాహీ, యశస్విని త్రయం 16–12 పాయింట్ల తేడాతో వెరోనికా, మిరియమ్‌ జాకో, సారా రాహెల్‌లతో కూడిన హంగేరి జట్టును ఓడించింది.

అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ కాంస్య పతక పోరులో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్, దీపక్‌ కుమార్, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 14–16తో మిలెంకో, స్టెఫనోవిచ్, లాజార్‌లతో కూడిన సెర్బియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల స్కీట్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ గుర్జత్‌ ఖంగురా క్వాలిఫయింగ్‌లో 115 పాయింట్లు స్కోరు చేసి 56వ స్థానంలో నిలిచాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్స్‌ జరగనున్నాయి. ఈ రెండు విభాగాల్లో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశముంది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్‌ సౌరభ్‌ కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
మనూ, రాహీ, యశస్విని

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top