
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 22 బంతుల్లో 28 పరుగులు సాధించాడు.
కేఎల్ రాహుల్‌తో కలిసి 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఈ ముంబైకర్ నెలకొల్పాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 2000 పరుగులు మైలు రాయిని అత్యంతవేగంగా అందుకున్న భారత ప్లేయర్‌గా జైశ్వాల్ నిలిచాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు. భారత ఓపెనర్ కేవలం 21 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.
గవాస్కర్ రికార్డు బద్దలు..
ఇంతకముందు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) పేరిట ఉండేది. గవాస్కర్ 23 మ్యాచ్‌లలో ఈ మైల్‌స్టోన్‌ను సాధించాడు. గవాస్కర్ ఈ రికార్డును 1976లో సాధించాడు. తాజా మ్యాచ్‌తో 49 ఏళ్ల గవాస్కర్ ఆల్‌టైమ్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు.
అయితే ఇన్నింగ్స్‌ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ సరసన జైశ్వాల్ నిలిచాడు. సెహ్వాగ్, ద్రవిడ్ ఈ ఘనతను 40 ఇన్నింగ్స్‌లలో సాధించగా.. జైస్వాల్ వారిని సమం చేశాడు. అయితే వారిద్దరికి ఈ ఫీట్‌ను అందుకోవడానికి 25 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.
ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్(15 మ్యాచ్‌లు) అగ్రస్ధానంలో ఉండగా.. జార్జ్ హెడ్లీ (17), హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (22),మైఖేల్ హస్సీ (20), మార్నస్ లబుషేన్(20) ఉన్నారు.
ఆరేసిన సిరాజ్..
ఇక ఈ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (184 నాటౌట్; 207 బంతుల్లో 21×4, 4×6), హ్యారీ బ్రూక్ (158; 234 బంతుల్లో 17×4, 1×6) అద్బుతమైన సెంచరీలతో మెరిశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 64/1తో నిలిచింది. రాహుల్ (28), కరుణ్ నాయర్ (7) క్రీజులో ఉన్నారు.
చదవండి: బ్రాత్‌వైట్ వరల్డ్ రికార్డు.. ఇక ముందు కూడా ఎవరికీ సాధ్యం కాదు!