Wriddhiman Saha: భారత టెస్ట్‌ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం

Wriddhiman Saha Opts To Quit Ranji Trophy As Told He Wont Be Picked For Test Team - Sakshi

Saha Opts To Quit Ranji Trophy: కెరీర్ చరమాంకంలో ఉన్న టీమిండియా వెటరన్‌ వికెట్ కీపర్, బెంగాల్‌ ఆటగాడు వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ప్రారంభంకాబోయే రంజీ సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటన చేశాడు. వ్యక్తిగత కారణాల చేత రంజీల నుంచి తప్పకుంటున్నట్టు వెల్లడించాడు. 

అయితే ఈ నిర్ణయం వెనుక వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే నెలలో శ్రీలంకతో స్వదేశంలో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ అతన్ని పరిగణలోకి తీసుకోవట్లేదని బీసీసీఐ ముఖ్య అధికారి ఒకరు అతనితో నేరుగా చెప్పారట. పంత్‌కు ప్రత్యామ్నాయంగా కేఎస్‌ భరత్‌కు అవకాశమివ్వాలని సెలెక్టర్లు డిసైడ్‌ చేశారని సదరు అధికారి సాహాకు వివరించాడట. 

ఇది తెలిసే సాహా రంజీల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఎలాగూ టీమిండియాలో చోటు దక్కదు.. ఇక రంజీలు ఆడి ఏం ప్రయోజనమని సాహా వారి వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా, 39 ఏళ్ల సాహా చివరిసారిగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆడాడు. అప్పుడు రెగ్యులర్‌ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. సాహాకు అవకాశమిచ్చారు. 

అయితే, ఆ సిరీస్‌లో అతను పెద్దగా రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా పర్యటనకు తిరిగి పంత్‌నే వికెట్‌కీపర్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. మరోవైపు పంత్‌కు సబ్‌స్టిట్యూట్‌గా యువ ఆటగాడు కేఎస్‌ భరత్‌ను బీసీసీఐ ఎంకరేజ్‌ చేస్తున్నట్లు స్పష్టమవడంతో సాహా పూర్తిగా వైరాగ్యంలోని మునిపోయినట్లు తెలుస్తోంది. టీమిండియాకు ఆడాలన్న కసి అతనిలో ఉన్నా వయసు మీద పడటంతో బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టింది. ఈ నేపథ్యంలోనే సాహా రంజీల నుంచి పూర్తిగా వైదొలగాలిని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే, భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మార్చి 3 నుంచి టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్‌ మార్చి 3 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్‌ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనుంది. టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు ఆడిన సాహా.. 1353 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి.  వికెట్ కీపర్‌గా అతను104 మందిని పెవిలియన్ కు పంపాడు. ఇందులో 92 క్యాచ్‌లు, 12 స్టంప్‌ అవుట్‌లు ఉన్నాయి. 
చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి రోహిత్‌.. కోహ్లికి మరింత దగ్గర
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top