WPL 2023: RCB VS DC Match Live Updates And Highlights - Sakshi
Sakshi News home page

WPL 2023 RCB VS DC: షఫాలీ విధ్వంసం.. ఐదేసిన తారా, ఆర్సీబీపై ఢిల్లీ ఘన విజయం

Published Sun, Mar 5 2023 4:04 PM

WPL 2023: RCB VS DC Match Live Updates And Highlights - Sakshi

షఫాలీ విధ్వంసం.. ఐదేసిన తారా, ఆర్సీబీపై ఢిల్లీ ఘన విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ధేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా డీసీ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తారా నోరిస్‌ (5/29) ఐదేసి ఆర్సీబీ పతనాన్ని శాసించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 

అంతకుముందు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్‌ లాన్నింగ్‌ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్‌సెంచరీలతో శివాలెత్తడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.  

ఐదేసిన తారా నోరిస్‌.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ఫైఫర్‌ నమోదు
డబ్ల్యూపీఎల్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత నమోదైంది. డీసీ పేసర్‌ తారా నోరిస్‌ ఈ ఫీట్‌ను సాధించి రికార్డుల్లోకెక్కింది. ఆర్సీబీతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్‌ చేసిన తారా.. 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. తారా.. ఐదు వికెట్ల ఘనత సాధించడంతో పాటు తన జట్టును విజయపథంలో నడిపిం​చడంలో ప్రధానపాత్ర పోషించింది. 

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ.. 11 బంతుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 105/7గా ఉంది. మెగాన్‌ షట్‌ (5), హీథర్‌ నైట్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. 

నిప్పులు చెరిగిన తారా నోరిస్‌.. వరుస ఓవర్లలో 4 వికెట్లు
డీసీ పేసర్‌ తారా నోరిస్‌ వరుస ఓవర్లలో 4 వికెట్లు నేలకూల్చి ఆర్సీబీ ఓటమిని దాదాపుగా ఖరారు చేసింది. 11వ ఓవర్‌లో ఎల్లీస్‌ పెర్రీ, దిషా కసత్‌లను ఔట్‌ చేసిన నోరిస్‌.. 13వ ఓవర్‌లో వరుస బంతుల్లో రిచా ఘోష్‌ (2), కనిక అహుజా (0)లను పెవిలియన్‌కు పంపింది. 13 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 96/6గా ఉంది. హీథర్‌ నైట్‌ (3), ఆషా శోభన (2) క్రీజ్‌లో ఉన్నారు. 

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో ఆర్సీబీ రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తారా నోరిస్‌.. ఎల్లీస్‌ పెర్రీ (31), దిషా కసత్‌ (9)లను మూడు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపింది. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 91/4గా ఉంది. హీథర్‌ నైట్‌ (1), రిచా ఘోష్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. స్మృతి ఔట్‌
56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ స్మృతి మంధన (22 బంతుల్లో 35)ను క్యాప్సీ ఔట్‌ చేసింది. శిఖా పాండేకు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి మంధన పెవిలియన్‌ బాట పట్టింది. 7 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 58/2గా ఉంది. ఎల్లీస్‌ పెర్రీ (8), దిషా కసత్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ, డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. అయితే 5వ ఓవర్లో సోఫీ డివైన్‌ను షఫాలీ వర్మ అద్భుతమైన డైవిండ్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 5 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 47 పరుగులుగా ఉంది. స్మృతి మంధన (28), ఎల్లీస్‌ పెర్రీ (5) క్రీజ్‌లో ఉన్నారు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్ల ఊచకోత.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓ రేంజ్‌ విధ్వంసం సాగించి భారీ స్కోర్‌ చేసింది. షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్‌ లాన్నింగ్‌ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్‌సెంచరీలతో శివాలెత్తగా.. మారిజాన్‌ కాప్‌ (17 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్‌ (15 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు) ఆఖర్లో చెలరేగి ఆడారు.

ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. షఫాలీ, లాన్నింగ్‌లను హీథర్‌ నైట్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపడంతో స్కోర్‌ కాస్త మందగించింది. షఫాలీ, లాన్నింగ్‌ క్రీజ్‌లో ఉండగా స్కోర్‌ సునాయాసంగా 250 దాటుందని అందరూ భావించారు. 

ఒకే ఓవర్‌లో షఫాలీ, లాన్నింగ్‌లను పెవిలియన్‌కు పంపిన నైట్‌
సునామీ వచ్చి వెళ్లాక సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో షఫాలీ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెగ్‌ లాన్నింగ్‌ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) ఔటయ్యాక డీసీ శిబిరం కూడా అంతే సైలెంట్‌గా మారిపోయింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు ఉతుకుడే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరిని డీసీ స్పిన్నర్‌ హీథర్‌ నైట్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపింది. 16 ఓవర్ల తర్వాత డీసీ స్కోర్‌ 177/2గా ఉంది. క్రీజ్‌లో మారిజన్‌ కప్‌ (12), జెమీమా రోడ్రిగెస్‌ (3) ఉన్నారు. 

లేడీ సెహ్వాగ్‌ ఊచకోత.. లాన్నింగ్‌ విధ్వంసం
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు షఫాలీ వర్మ (44 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్‌ లాన్నింగ్‌ (40 బంతుల్లో 64; 12 ఫోర్లు) పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. దాదాపు ప్రతి బంతిని బౌండరీలకు తరలిస్తున్నారు. వీరి దెబ్బకు స్కోర్‌ బోర్డు బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకుపోతుంది. 14 ఓవర్ల తర్వాత డీసీ స్కోర్‌ 150/0గా ఉంది. 

ఇదెక్కడి విధ్వంసం.. హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్న షఫాలీ, లాన్నింగ్‌
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్లు షఫాలీ వర్మ (32 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మెగ్‌ లాన్నింగ్‌ (30 బంతుల్లో 51; 10 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరిద్దరి ధాటికి డీసీ 10.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 111 పరుగులు చేసింది.  

దుమ్మురేపుతున్న షఫాలీ వర్మ, మెగ్‌ లాన్నింగ్‌
ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన డీసీ.. 6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (20 బంతుల్లో 290, మెగ్‌ లాన్నింగ్‌ (16 బంతుల్లో 24) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.   

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ
మహిళల ఐపీఎల్‌ (WPL) అరంగట్రేం సీజన్‌ (2023)లో భాగంగా ఇవాళ (మార్చి 5) ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ): స్మృతి మంధన(కెప్టెన్‌), సోఫీ డివైన్‌, హీథర్‌ నైట్‌, దిషా కసత్‌, ఎల్లిస్‌ పెర్రీ, రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌), కనిక అహుజా, ఆషా శోభన, ప్రీతి బోస్‌, మెగాన్‌ షట్‌, రేణుకా సింగ్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ): షఫాలీ వర్మ, మెగ్‌ లాన్నింగ్‌ (కెప్టెన్‌), మరిజాన్‌ కప్‌, జెమీమా రోడ్రిగెస్‌, అలైస్‌ క్యాప్సీ, జెస్‌ జోనాస్సెన్‌, తానియా భాటియా (వికెట్‌కీపర్‌), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్‌, టారా నోరిస్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement