
లక్నో: గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి పతకంపై గురి పెట్టాడు. సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల ఫ్రీస్టయిల్ జట్లను సోమవారం ప్రకటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. 22 ఏళ్ల అమన్ జూన్‌లో మంగోలియాలో జరిగిన ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచాడు. రెండు నెలల తర్వాత మళ్లీ మ్యాట్‌పైకి అడుగు పెట్టిన అమన్ చురుకైన కదలికలతో ఆకట్టుకున్నాడు. ట్రయల్స్‌లో తన ప్రత్యర్థులు సుమీత్, రాహుల్‌లపై అమన్ ‘టెక్నికల్ సుపిరీయారిటీ’ పద్ధతిలో (ప్రత్యరి్థపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించడం) అలవోకగా గెలిచాడు.
‘నా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నానని భావిస్తున్నాను. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధంగా ఉన్నా. ఏడాది తర్వాత బరిలోకి దిగిన మంగోలియా టోర్నీలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఓవరాల్‌గా నా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా’ అని అమన్ వ్యాఖ్యానించాడు. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన అమన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం ఇంకా పతకాల బోణీ కొట్టలేదు. మరోవైపు మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అంతిమ్ జాతీయ ట్రయల్స్‌లో తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచింది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన 20 ఏళ్ల అంతిమ్ ఇప్పటికే ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, గ్రాండ్‌ప్రి సిరీస్ టోరీ్నల్లో, అండర్–20, అండర్–17 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది.
భారత పురుషుల ఫ్రీస్టయిల్ జట్టు: అమన్ సెహ్రావత్ (57 కేజీలు), ఉదిత్ (61 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), రోహిత్ (70 కేజీలు), జైదీప్ (74 కేజీలు), అమిత్ (79 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు), దీపక్ పూనియా (92 కేజీలు), విక్కీ (97 కేజీలు), రజత్ (125 కేజీలు). భారత మహిళల ఫ్రీస్టయిల్ జట్టు: అంకుశ్ (50 కేజీలు), అంతిమ్ (53 కేజీలు), నిశు (55 కేజీలు), తపస్య (57 కేజీలు), నేహా (59 కేజీలు), మనీషా (62 కేజీలు), వైష్ణవి (65 కేజీలు), సృష్టి (68 కేజీలు), జ్యోతి (72 కేజీలు), ప్రియా మలిక్ (76 కేజీలు).