
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025కు రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. తాజాగా ఈ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఈ టోర్నీ మొత్తం ఐదు నగరాల్లో జరగనుంది. భారత్‌లోని గౌహతి, ఇండోర్, నవీ ముంబై, విశాఖపట్నం నాలుగు వేదికలు కాగా.. శ్రీలంకలోని కొలంబోని ప్రేమదాస స్టేడియం 11 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.
ఐసీసీ కీలక నిర్ణయం..
అయితే అభిమానులను భారీ సంఖ్యలో స్టేడియం రప్పించేందుకు అన్ని లీగ్ మ్యాచ్‌ల టిక్కెట్ల ధరను ఐసీసీ కేవలం రూ. 100 రూపాయలగా నిర్ణయించింది. మొదటి దశ టిక్కెట్ల అమ్మకాలు గురువారం (సెప్టెంబర్ 4) రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యాయి.
అయితే ఫస్ట్ ఫేజ్‌లో కేవలం కేవలం గూగుల్ పే వినియోగదారులు మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌కు గూగల్ గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఇక రెండో దశ సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సెకెండ్ ఫేజ్‌లో టిక్కెట్లు మొత్తం అందరికి అందుబాటులో ఉంటాయి.
కాగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు. ఈ మ్యాచ్‌తో పాటు బంగ్లాదేశ్ vs పాకిస్తాన్, ఆస్ట్రేలియా vs శ్రీలంక టిక్కెట్లను కూడా ఇంకా అందుబాటులో ఉంచలేదు.
కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 30ను గౌహతి వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ సందడి చేయనుంది. వరల్డ్‌కప్ టిక్కెట్లు ఇంత తక్కువ ధరకు విక్రయించడం ఇదే తొలిసారి.
చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్