
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)పై భారత మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి తీవ్ర విమర్శలు చేశాడు. తనకు నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని.. నచ్చనివాళ్ల కెరీర్‌ను నాశనం చేశాడని ఆరోపించాడు. కాగా తన కుమారుడు, టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కెరీర్ ముగిసిపోవడానికి ధోనినే కారణమని యోగ్‌రాజ్ గతంలో ఎన్నోసార్లు విమర్శించిన విషయం తెలిసిందే.
గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే
తాజాగా మరో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. ధోని గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. యోగ్‌రాజ్ మరోసారి తెరమీదకు వచ్చాడు. ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం ఇర్ఫాన్ ఒక్కడి గురించే కాదు. గౌతం గంభీర్ కూడా చాలాసార్లు తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాడు.
వీరేందర్ సెహ్వాగ్ కూడా బహిరంగంగానే ఈ విషయం గురించి చెప్పాడు. హర్భజన్ సింగ్ కూడా తనను ఈగలాగా పక్కనపెట్టాడని చెప్పాడు. అసలు ధోని ఎందుకు అలా చేశాడో తెలుసుకోవడానికి జ్యూరీని ఏర్పాటు చేయాలి.
కానీ.. ఎంఎస్ ధోని వారికి జవాబు ఇవ్వడు. తప్పు చేసిన వాళ్లే ఇలా తప్పించుకుతిరుగుతారు. అయినా వారి ఆత్మసాక్షికి అంతా తెలిసే ఉంటుంది’’ అని యోగ్‌రాజ్ సింగ్ ధోనిపై మరోసారి ఆరోపణలు చేశాడు.
చెత్తలా తీసిపడేస్తారు
అదే విధంగా.. మాజీ కెప్టెన్ల గురించి మాట్లాడుతూ.. ‘‘బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, ఎంఎస్ ధోని.. వీళ్లంతా మనుషులను ఓ చెత్తలా తీసిపడేస్తారు. మరోసారి చెప్తున్నా.. మనకు ఉన్న ఇలాంటి కెప్టెన్ల వల్లే మన జట్టు నాశనమైంది’’ అని యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్
కాగా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా ధోనికి పేరుంది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013 టైటిళ్లను కెప్టెన్ హోదాలో ధోని గెలిచాడు. ఇదిలా ఉంటే.. గతంలో ధోనిని ఉద్దేశించి ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాయి.
ధోని, నేను కలిసి కూర్చుని తాగుతున్నాం
నచ్చిన వాళ్లు, హుక్కా తాగుతూ.. అతడికి అందించే వాళ్లకే జట్టులో చోటు ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ గతంలో పరోక్షంగా ధోనిని విమర్శించాడు. ఇటీవల టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పుట్టినరోజు నేపథ్యంలో ఇర్ఫాన్ విషెస్ చెప్పగా.. ఓ నెటిజన్.. ‘‘హుక్కా సంగతి ఏమైంది భయ్యా’’ అని అడిగారు.
ఇందుకు ఇర్ఫాన్ బదులిస్తూ.. ధోని, నేను కలిసి కూర్చుని తాగుతున్నాం అంటూ కామెంట్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యోగ్‌రాజ్ సింగ్ మరోసారి ధోనిని టార్గెట్ చేశాడు.
ఐదు వికెట్లు.. పదకొండు పరుగులు
కాగా 67 ఏళ్ల యోగ్‌రాజ్ సింగ్ 1980- 81 మధ్య టీమిండియా తరఫున ఆడాడు. ఆరు వన్డేల్లో కలిపి నాలుగు వికెట్లు తీయడంతో పాటు ఒక పరుగు సాధించిన ఈ సీమర్.. ఒక టెస్టు ఆడి ఒక వికెట్ తీయడంతో పాటు.. పది పరుగులు చేశాడు. అయితే, తన కుమారుడు యువరాజ్ సింగ్‌ను మాత్రం యోగ్‌రాజ్ మేటి క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాడు.
చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్