
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం) పరాజయంపాలైంది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31), ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించి టీమిండియా పరువు కాపాడారు.
నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా గిల్ తొలి మ్యాచ్‌లోనే (10) నిరాశపరిచాడు. ఓవర్ హైప్ మధ్య శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా భారత్ పవర్‌ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.
ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది.
అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిన కుదించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్‌షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది.
గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు, ఆట మొత్తం క్యాచ్-అప్ గేమ్‌గా మారుతుంది. ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని పాజిటివ్‌లు కూడా ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాం. దానికి సంతృప్తిగా ఉన్నాం" అని అన్నాడు.
అభిమానుల మద్దతుపై కూడా గిల్ స్పందించాడు. "అభిమానులు భారీగా వచ్చారు. మేము అదృష్టవంతులం. అడిలైడ్‌లో కూడా మాకు ఇలాగే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నాడు.
కాగా, గిల్ తన వన్డే కెప్టెన్సీ కెరీర్‌ను ఓటమితో ప్రారంభించాడు. తద్వారా విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఓటమితో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. ఈ ఏడాది ఎనిమిది వరుస విజయాల తర్వాత (వన్డేల్లో) భారత్‌కు ఇది తొలి పరాజయం.