
వన్డేల్లో అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి
ఏడాదిలో టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన ఆంధ్ర ప్లేయర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డ నితీశ్ కుమార్ రెడ్డి... ఏడాది తిరిగేలోపు జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది అక్టోబర్‌లో టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నితీశ్ రెడ్డి... ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ బరిలోకి దిగిన ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్... ఆ సిరీస్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు.
లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ధాటిగా షాట్లు ఆడగల సత్తా... ఉపయుక్తమైన మీడియం పేస్ బౌలింగ్ అతడికి వరుసగా అవకాశాలు కల్పించింది. హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మాట్‌కు దూరం కావడంతో... సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టు చాలా కాలంగా పేస్ ఆల్‌రౌండర్ కోసం నిరీక్షిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకున్న నితీశ్ ఇప్పుడు తాజాగా వన్డే ఫార్మాట్‌లో సైతం అవకాశం దక్కించుకున్నాడు.

పాండ్యా గైర్హాజరీలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచి్చన ఈ ఆల్‌రౌండర్ 11 బంతులెదుర్కొని 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగకపోవడంతో అతడికి క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు. బౌలింగ్‌లో మాత్రం 2.1 ఓవర్లు వేసిన నితీశ్ 16 పరుగులిచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు.
టెస్టు అరంగేట్రం చేసిన చోటే...
ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా పెర్త్ టెస్టు ద్వారానే తొలి టెస్టు ఆడిన 23 ఏళ్ల నితీశ్ రెడ్డి... మళ్లీ ఇప్పుడు అక్కడే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మొత్తం విఫలమైన చోట... ధనాధన్ బ్యాటింగ్‌తో 41 పరుగులు చేసిన నితీశ్... రెండో ఇన్నింగ్స్‌లో అయితే ఏకంగా టి20 మ్యాచ్ ఆడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 38 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు చూపిన తెగువ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ సైతం నితీశ్‌కు విరివిగా అవకాశాలు ఇచి్చంది. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ మైదానంలో జరిగిన పోరులో నితీశ్ వీరవిహారం చేశాడు.
ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచి్చన అతను ఆసీస్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకొని సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు... గాయాల బారిన పడి కాస్త వెనుకబడ్డాడు. అయితే క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో సత్తాచాటిన నితీశ్‌పై సెలెక్టర్లు నమ్మకముంచారు.
గాయం నుంచి కోలుకొని...
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన నితీశ్ జట్టుకు దూరమయ్యాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చాక అతడు పూర్తిగా మారిపోయాడు. సమయపాలన, క్రమశిక్షణ మొదటి నుంచే ఉన్న నితీశ్ రెడ్డి... వాటిని మరింత కఠినతరం చేశాడు. సరదాలు, షికార్లు పక్కనపెట్టి పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టాడు.
అదే సమయంలో తండ్రికి మోకాలి శస్త్రచికిత్స జరిగినా ఇంటికి వెళ్లకుండా పూర్తిగా సాధనకే పరిమితమయ్యాడు. విశాఖపట్నంలో ఉన్నన్ని రోజులు... జిమ్ లేదంటే మైదానంలోనే గడిపేవాడని అతడి తండ్రి ముత్యాల రెడ్డి పేర్కొన్నారు. అలా గంటల తరబడి శిక్షణ సాగిస్తూ మరింత రాటుదేలాడు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం అతడి ఫిట్‌నెస్ మునుపటికంటే రెట్టింపు అయింది. అది ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్రస్ఫుటమైంది.
సూపర్ క్యాచ్
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో నితీశ్ ఫర్వాలేదనిపించాడు. స్పిన్‌కు సహకరించే భారత పిచ్‌లపై పేస్ ఆల్‌రౌండర్‌గా ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం దక్కని ఆంధ్ర ప్లేయర్... బ్యాటింగ్‌లో రాణించాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్ పట్టిన క్యాచ్ చూస్తే... అతడి ఫిట్‌నెస్ స్థాయి ఏంటో అర్థమవుతుంది. స్క్యేర్ లెగ్‌లో విండీస్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను చిరుతలా దూకుతూ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే.
ప్రస్తుతం జట్టులో ఉన్న ఫిటెస్ట్ ప్లేయర్‌లలో అతడు ఒకడు అనడంలో సందేహం లేదు. యో–యో టెస్టు, బ్రంకో టెస్టుల్లో టీమిండియాలో అందరికంటే మెరుగైన స్కోరు నితీశ్ రెడ్డిదే అని సమాచారం. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా... హెడ్ కోచ్ గంభీర్ మాత్రం నితీశ్‌పై నమ్మకముందని అతడికి అండగా ఉంటామని స్పష్టంచేశాడు. ‘నితీశ్ ఎన్ని ఓవర్లు వేశాడనేది ముఖ్యం కాదు. జట్టుతో ఉండటమే ప్రధానం. అది ఎంతో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది.
23 ఏళ్ల కుర్రాడిని కేవలం విదేశీ పిచ్‌లపైనే పరీక్షించాలనే ఆలోచన మాకు లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా స్వదేశంలో సైతం అతడికి చాన్స్‌లు ఇస్తాం. ప్రస్తుతం పేస్ ఆల్‌రౌండర్లు చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. అందుకే నితీశ్‌కు అండగా ఉంటాం’ అని గంభీర్ అన్నాడు. వన్డే, టి20 ఫార్మాట్‌లలో హార్దిక్ పాండ్యా వంటి నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండగా... టెస్టుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు... పరిమిత ఓవర్లలోనూ తనదైన ముద్ర వేయాలని నితీశ్ భావిస్తున్నాడు.